• చిగురుకల కు స్వాగతం

పాట కచేరి

పాట కచేరి

 

మౌనమే నీ భాష ఓ మూగమనసా !

 

''మీరు ఏమనుకుంటున్నారో, అదే జరగుతుంది, అందుకు మన మనసే సాక్ష్యం-''

 

మనిషితో పాటే మనసు, మనసుతో పాటే మనిషి. ఈ రెంటినీ విడదీసి చూడటం సాధ్యం కాదు. 'ఫేస్‌ ఈజ్‌ ది ఇండేక్స్‌ ఆఫ్‌ మైండ్‌' అన్నాడు ఓ పెద్ద మనిషి. ఈ మనసు గురించి బాల్యంలో మనకు అంతుపట్టకపోయినా, దాని గురించి తెలియకపోయినా. అది మన వయసుతో పాటు మన ఆలోచనలకు రూపం తరం మన మనసు.

 

ఎదన్న చిన్న తప్పు జరిగినా, ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ..... వీళ్లు మనసులేని మనుషులండి అనడం సహజం.

 

అయితే మనసు ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. ఆ మౌనంలో అనేక అర్ధాలు అంతరార్ధలు ఉంటాయి. అంతదూరం ఎందుకూ - ఎవరైన మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మన తల దూర్చకుండ మౌనంగా వినడమే సంస్కారం.

 

అయితే-

 

మన-సుకవి మనసు గురించి చెప్పిన సిద్ధాంతాలు అన్ని ఇన్ని కావు.... మనసుకు పాటతో పట్టం కట్టి.  మనసు అంతరంగాన్ని తెలుగువాడి పెదవులపై పాటగా ఆవిష్కరించాడు.

 

ఒక్క మాటలో చెప్పలాంటే మనసు ఊసరవెల్లిలాంటిది. అది మనిషిని కవ్విస్తుంది,నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.

 

ఆత్రేయ మనసుగారడి గురించి ఈ విధంగా అంటారు 'గుప్పెడు మనసు' చిత్రంలో...

 

''మౌనమే నీ భాష ఓ మూగ మనసా.......కల్లలు కాగానే కన్నీరౌతావు' అంటారు పల్లవిలో....

 

  ఈ పాటలో ఆత్రేయ పల్లవి ఎత్తుగడ మనసు లక్షణాన్ని తెలియజేస్తుంది. చరణాల్లో మనసును అనేక కోణాల్లో ఎత్తి చూపుతారు. ఈ చరణాలు కాస్తంత పెడసరం అనిపించినా.....మనసు వల్ల ఎదురయ్యే చిక్కు లెక్కలను హెచ్చరికగా తెలియజేస్తారు. అదే మనసుతో ఎలా ఎదుర్కోవాలో వివరిస్తారు.

 

సాధరణంగా మనసు ప్రధాన లక్షణం విషాధం కలిగించడమే అన్న విషయం ప్రస్పుటం చేస్తుంది.

 

ఆత్రేయ మనసును నిందించేటప్పుడు కూడా పదాలలో గాఢత, నింద స్తుతి కూడా చమక్కులు కనిపిస్తాయి. భాషలో సరళత మనకు కనిపిస్తుంది.

 

ఒకమాటలో చెప్పాలంటే - రామదాసు రామభక్తుడు అని మనందరికి తెలుసు. భక్తి భావంతో తాను చేసిన పని శిక్షగా మారేటప్పటికి.... భగవంతుడ్ని నిందిస్తాడు'' ఎవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు రామచంద్ర'' అని. ఇక్కడ మనసు మాయ వల్ల ఏర్పడిన భక్తుని దుస్థితికి భగవంతుడు మనసు కూడా కాస్తంత మెత్తబడుతుంది. తర్వాత కథ మనకు తెలిసినదే.... అలా అని భక్తిభావం తగ్గలేదు.

 

ఈ పాట పల్లవి కూడా ఒక కీర్తనలాగానే మనకు వినిపిస్తుంది. మనసును కూడా సున్నితంగా మందలిస్తూనే చరణాల్లో ఈ విధంగా ప్రశ్నిస్తాడు?

 

''చీకటి గుహ నీవు

 

చింతల చెలి నీవు

 

నాటకరంగానివే - మనసా''

 

ఈ చరణంలో మనకు ప్రధానంగా కనిపించేది 'జీవికను భౌతిక వస్తువలతో సరిపోల్చి చెప్పడం' ఒక కొత్త ప్రయోగంగా భావించవచ్చు.

 

జీవితం తెర మీద జరిగే నాటకానికి నీవే సూత్రధారివి, పాత్రధారివి అంటూనే 'తెగిన పతంగానివి' నీకు ఒక దారితెన్నులేని దారి నీది. నీ మానసిక స్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు.

 

అయితే ఇక్కడ మనకు కనిపించే అతిశయోక్తి పద ప్రయోగాలు ' చీకటి గుహ, చింతలచెలి, నాటకరంగం' అనే పదాలు నిజ జీవితానికి దగ్గరగానూ అన్వయించబడతాయి.

 

''కోర్కెల సెలనీవు

కూరిమి వల నీవు

ఊహల ఊయ్యాలవే''

 

సెలలో నీరు ఊరినట్లుగానే, సాలెగూడులాంటి వల, ఊహల్లో ఊరిగించడం నేల మీదకు పడదోయడం అనేవి మనసు అనిశ్చిత స్థితిని, బలహీనతను వ్యక్తికరిస్తాయి.

 

దుఃఖం తీవ్రత అధికమైనప్పుడు నువ్వు ఒక 'మాయల దెయ్యానివి' అని నిందించడం ఎంతో ఔచిత్యంగా మనకు కనపడుతుంది.

 

చివర వాక్యాల్లో -

 

లేనిదాని గురించి తాపత్రయం. ఉన్నదాని గురించి శ్రద్ధ కనపరచము. ఇలాంటి అనిశ్చితి కారణంగా మనసుకు నిబద్ధత లేదు అనే విషయాన్ని వ్యాజ నిందగా అవగతమూతుంది.

 

చిన్నపొరపాటు జీవితమంతా వెంటాడుతుందని గుర్తుచేస్తూ'ఒకపొరబాటుకు యుగములు పొగిలేవు''.

 

ఇది మన అందరికి అనుభవమే తప్పు జరిగిన తర్వాత నిందించుకుంటాము. బాధపడతాము అలా చేసిఉండకూడదని. అలా జరిగి ఉండకూడదని అనుకుంటూనే తప్పు మీద తప్పు జరుగుతుంది. ఈ పాటలోని చరణకింకిణిలు గల్లుగల్లుమని మ్రోగవుకానీ, ప్రశ్నిస్తాయి, ఆలోచింపజేస్తాయి, అనుభూతుల్ని మిగులిస్తాయి.... ఈ అనుభవ సారంశం ఆత్రేయ మనసును మధించిన పాటలోనే కనిపిస్తుంది. వినిపిస్తుంది.  ఇది జగమేరిగిన సత్యం.

 

 ఈ మనసు మాయలో ప్రతి మనిషి తలవంచు తప్పదు. బాలమురళి తన గంధర్వగానంతో గాయపడ్డ 'గుప్పెడుమనసు' ను లాలీస్తూ ఉంటాడు.

 

మనం ఇంత విషయం మాట్లాడుకొన్న - ' ఎందుకు రగిలేవో - ఏమై మిగిలేవో' అని మనసును ప్రశ్నిస్తాడు.

 

మనసు మాత్రం మౌనంగానే ఉంటుంది. కలలతో కన్నీళ్లు తెప్పిస్తుంది. దాని భాష ఏ శాస్త్రానికి అందని ద్రాక్షపండువంటిది.

 

 

 

డా|| నృసింహ                                    బొల్లిముంత వెంకటరమణారావు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon