• చిగురుకల కు స్వాగతం

పాట ఓ అందమైన పూలతోట !

పాట ఓ అందమైన పూలతోట !

 

''పాట పక్షిలా వుండాలి'' - ఆరుద్ర

 

పాటలో లయ, శ్రుతి రసరమ్య భావనతో సాగితే మనసు ఆనందగిండవం చేస్తుంది. పాటకు సవ్రం ప్రధానం. అలాంటి పాట చిరంజీవిగా శ్రోత హృదయాలలో గుడి ట్టుకుంటుంది. సినిమా పాటను అంత తేలిగ్గా తిసివేయాల్సిన పనిలేదు. సాహిత్యంలో పాటలనే ప్రక్రియ ప్రజాబాహుళ్యంలో చోటు చేసుకోలేనంత వేగంగా ప్రతి నోట పరవశంగా సరిగంగస్నానాలు చేసింది. సినీ పాట. పాట తొలిమలి దశల్లో పాట తనదైన బాణిలో వాణిలో అలరించింది. చాలా మంది దృష్టిలో సినిపాట సన్నివేశ ప్రధానంగా మాత్రమే చోటుచేసుకుంది. కాని నిజానికి సినీపాట సన్నివేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఎంతో భావుకతతో ఎన్నో నిజాలను, ఆదర్శాలను, మానవ జీవితంలోని మానవతా దృక్పధాన్ని, భక్తిని, రక్తిని, హాస్య, వ్యంగ్యాన్ని యిలా చెప్పుకుంటూ పోతె ఎన్నో విషయాలను ప్రపంచానికి అందించింది. అందుకె సిని అభ్యుదయకవి అనిశెట్టి సుబ్బారావు గారు సినిమా పాటను ఒక విజ్ఞాన సర్వస్వంగా అభివర్ణించారు.

 

సినిమా పాటల తొలి తరం పాటల రచయితను చెప్పాల్సి వస్తే చందాల కేసవదాసు (సినిమా పాటలకు ఆద్యుడు) దైతా గోపాలం, సదాశివ బ్రహ్మ, వీటూరి, తోలెటి వెంకటరెడ్డి, అప్పలాచార్య, పింగళి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, సముద్రాల(సీనియర్‌ , జూనియర్‌) శ్రీశ్రీ, కోసరాజు, ఆరుద్ర, ఆత్రేయ, దాశరధి, ఆచార్య డా || సి.నారాయణ రెడ్డి, గోపి తదితరులు తమతమ పాటలతో సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. ప్రతివారి నోట వారు పాటగా పల్లవించారు. మలితరం కవుల్లో వేటూరి, సిరివెన్నెల, భాస్కరభట్ల, చంద్రబోస్‌,శుద్ధాల అశోక్‌తేజ, అనంత శ్రీరాం నేటి పాటకు సరికొత్త నడలు నేర్పుతున్నారు.

 

ఈ కవులు సినిమా పాటకు మాత్రమే పరిమితం కాలేదు. అనేక సాహితీ ప్రక్రియల ద్వారా తెలగువారి హృదయాలలో చిరంజీవులు. ఈ సాహితీమూర్తులు. వీరి పాటలు కేవలం లొల్లయి పదాలుగా కాకుండా ప్రతి పాటలోనూ తమ పదప్రయోగాల ద్వారా ప్రతి తెలుగువారి మనసును రంజింపజేసారు.

 

పాట అనేది కేవలం శబ్ద ప్రయోగాలకు, సన్నీవేశాలకు పరిమితం కాకుండా సామాజికపరమైన అంశాలను వాటి పరిష్కార మార్గాలను తమ పాట ద్వారా తెలియజేయడం జరిగింది. పాట కేవలం సరదా కోసమే కాదని పాటను ఒక ఆయుధంగానూ, దివ్యఔషధంగా సమయానుకూలంగా ఉపయోగించడం విశేషం . నిరాశతో సతమతమైనవాడిని అశావాహ దృక్పథం కలిగే విధంగా ''అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే, కాలం మరుగున దాగి సుఖమున్నదిలె'' అని శోకతప్త హృదయంతో కలతపడిన వారిని ఊరడించి ఆశను చిగురింపజేసే  వాక్యాలు ఈ పాటలో మనకు కనిపిస్తాయి, మరో పాటలో కలలు పగటి కలలు కాకుడదని ''కలకానిది విలువైనది...'' అని శ్రీశ్రీ వెటుగు నీడల చిత్రం ద్వారా తెలియజేస్తారు......

 

సినీ కవులు కేవలం వ్యక్తిగత విషయాలు  మాత్రమే కాదు. తమ పాటల ద్వారా దేశాభిమానం పెంపొందించే విధంగాను, సంస్కృతి సంప్రదాయాలను, చరిత్ర, సామాజిక అంశాలను ప్రస్ధావించడం జరిగింది. సామాజిక అసమానతలతో అలమటించిన అభాగ్యుల గురించి - '' దేశమంటే మనుషులోయ్‌'' చిత్రం ద్వారా శ్రీశ్రీ తన పాటలో ఈ విధంగా ప్రశ్నిస్తారు సంఘాన్ని '' పదుల, వందల కుటుంబాలకు, సంపద హెచ్చుగా యిచ్చిన దేశం, వేలు లక్షల కూలి జనాలను వీధుల్లోకి తోసిందా?'' అని ఈ పాటలో మనిషి మధ్య హెచ్చు తగ్గు కారణాలు ప్రతిబింబిస్తాయి.

 

స్త్రీ అభ్యుదయం కోసం ప్రతిబింబించే విధంగా ఒక పాటలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మశ్రీ డా|| సి. నారాయణ రెడ్డి గారు స్త్రీ గొప్ప తనాన్ని కీర్తిస్తారు.''మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ''.

 

అవినీతిని, బంధుప్రీతిని ఎండగడతారు ఆరుద్ర తన పవిత్ర బంధం చిత్రం ద్వారా ఈ విధంగా అంటారు..................

 

'' వ్యాపారాలకు పర్మిట్‌

 

వ్యవహారాలకు లైసెన్స్‌

 

అర్హతలేని వుద్యోగాలు

 

లంచం యిసై వోయస్‌''

 

గ్రామాలకు ప్రాణప్రధానమైన వ్యవసాయం నమ్ముకొన్న రైతు జీవితం గురించి కొసరాజుగారు తమ పాట ద్వారా ప్రస్థావించడం జరిగింది. రైతు ప్రతి ఉదయం ప్రయాణం ఈ విధంగా వుంటుందని తన పాటలో అంటారు ఓ సినీకవి.

 

''నవ ధాన్యాలను గంప నెత్తుకొని

 

చద్ది అన్నము మూటగట్టుకొని

 

ముల్లు గర్రను చేత పెట్టుకొని

 

ఇల్లాలిని నీ వెంట పెట్టుకొని''

 

ఏరువాక సాగాలోరన్నో చిన్నన్న (రోజులు మారాయి) చిత్రం ద్వారా తన జానపద బాణిని కడతారు. రైతు జీవితం గురించి జానపద కవి కొసరాజు.

 

 

 

జాతియోద్యమ భావాలను తమ సినీ పాటల ద్వారా కూడా తెలియజేసారు. ఈ పాటల ద్వారా ప్రజాచైతన్యం వెల్లి విరియాలని వారి ఆకాంక్ష. మాలపిల్ల చిత్రంలో బసవరాజు అప్పారావుగారి పాట జాతిపితనుఈ విధంగా కీర్తిస్తుంది.

 

''కొల్లాయి కట్టితేనేమి

 

మా గాంధి కోమటై పుట్టి తేనేమి''

 

ఈ పాట యావ జాతికి స్పూర్తిదాయకం. చైతన్య వీచిక.

 

సంఘంలో ఆసాంఘీకమైన దురలవాట్లలో మధ్యపానం సేవించడం, ఈ మధ్యపాన జూదంలో ఎన్నెన్నో కుటుంబాలు నాశనం కావడం నిత్యం కళ్ళ ముందర కనపడుతున్న సత్యం. ఈ సత్యాన్ని నిరసిస్తూ ''గృహలక్ష్మి'' లో సముద్రాల సీనియర్‌ ఈ విధంగా అంటారు.

 

'' ఇల్లూ వళ్ళు కూలదోసె

 

కళ్ళు తెరవండోయ్‌'' అంటారు.

 

మరో అసాంఘీకాంశమైన ''వరకట్నాన్ని'' నిరసిస్తూ..

 

''వరకట్నపు పిశాచాల దురంతాకోరలలో

 

అన్నెంపున్నెం ఎరుగని ఆడబ్రతుకు బలియేనా''

 

అంటూ పరిష్కారంగా యువత మారాలని ప్రభోదిస్తూ...

 

''చెప్పే నీతులన్ని చేతలలో చూపాలి

 

అబలల కన్నీటి మంటలార్పివేయగలగాలి''

 

అంటారు. డా|| సి. నారాయణ రెడ్డి గారు.

 

మరో సందర్భంలో రైతుబిడ్డ చిత్రం ద్వారా-

 

''దేముడు సృష్టించాడు లోకాలు

 

ఈ మనిషి కల్పించాడు భేదాలు'' అని వ్యత్యాసాలను నిరసిస్తారు.

 

మనిషి జీవితానికి అత్యంత విలువైనది. గౌరవాన్ని పెంపొందించేది సంపద. ఆ ధనం విలువ తెలుసుకోవాలని. మనిషి జీవితానికి ధనం అనేది ఇంధనంలా ఎలా పనిచేస్తుంది. దానిని ఎలా అదుపులో వుంచుకొవాలో తెలియజేసారు.

 

'' ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడె

 

గుణవంతుడు, బలవంతుడు, ధనవంతుడురా''

 

అని 'లక్ష్మినివాసం' చిత్రం ద్వారా ఈ విధంగా ప్రభోదిస్తారు.....

 

''ధనమేరా అన్నిటికి మూలం

 

ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం'' అని ఉపదేశిస్తారు.

 

సినీ పాటలో కేవలం మాధుర్యమే కాదు. నవరసాలలో ఒకటైన హాస్యం కూడా ఈ పాటల ద్వారా ప్రముఖస్థానం అలంకరించింది. తెలగు శ్రోతల హృదయాలను అలరించింది. ఈ పాటలు హాస్యప్రధానమైనవి.

 

అయినప్పటికి వీటిలో సామాజిక ప్రబోధం, సంస్కరణ  సందేశాలను అందించడం జరిగింది. వాటిలో అత్యంత ప్రముఖంగా చెప్పుకొదగినవి.

 

1.అయ్యయ్యో చేతలు డబ్బులు పోయెను...

 

2. సరదా సరదా సిగరెట్టు....

 

3. సోడా సోడా....

 

4. పొరుగింటి మీనాక్ష్మమ్మను చూశారా?

 

5. డివ్వి డివ్విట్టం నువ్వంటె నా కిష్టం....

 

పాట నిరంతర స్వర ఝరిలా ప్రవహిస్తూనే వుంటుంది. ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ నిరంతర ప్రవాహినిగా తెలుగువారి హృదయాలను రంజింపజేస్తూ వారిలో సరికొత్త ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.

 

తెలుగు సినిమా పాట 1947 నుండి 1990 వరకు స్వర్ణయుగమని చెప్పాలి. పాట కేవలం ఏదో ఒక రసానికి పరిమితం కాలేదు. హృదయాలను రంజింపజేస్తూ వారిలో సరికొత్త ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.

 

ఈ పాటల్లో భక్తి భావం, ప్రేమ మాధుర్యాన్ని, దేశభక్తి, చరిత్ర సత్యాలను, చదువు సంధ్యలను, విప్లవ భావాలను తదితర భావాలను పాటలో పల్లవించి మనిషి అంతరంగంలో సరికొత్త లయలను ఆవిష్కరించింది.

 

పాట కేవలం సంగీతంతోనే ముడిపడలేదు. సాహిత్యం, సంగీతం, సమపాళ్ళలో కలవాలి. అందుకు కళాకారులు కూడా తగిన న్యాయం చేయాలి. ఆ పాట తేనలూరుతుంది. తెలుగుదనం నిండిన పాట ఎలా వుంటుందంటే...

 

''పాడతా తియ్యగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా ''

 

ఘంటసాలగారి పాట మాట తేట తేట తెలుగులా ఉంటుంది...

 

''తేట తేట తెలుగులా ..

 

తెల్లవారి వెలుగులా''  ఓ సుప్రభాత గీతంలా తెలుగు గుండెను తడుతుంది.

 

పాట ప్రవాహం సరికొత్త కలాలతో, స్వరాలతో లయబద్ధంగా ఎగసిపడుతుంది.

 

పాట ఒక పద్యంలా, వేద మంత్రంలా ప్రజల నాలుకల పై నాట్యమాడుతుంది. ఈ పాటల పల్లకిని మోసిన బోయలుగా గీతరచయితలు, సంగీతకారులు, గాయకులు అమరజీవులు.

 

అందుకే పాట అంటే..

 

పాట ఒక ఘంటసాల

 

పాట ఒక సాలూరి

 

పాట ఒక కృష్ణశాస్త్రి !!

 

 

 

ప్రకృతి కృతిలో పిల్లతెమ్మరలా మన హృదయాలను హత్తుకుంటుంది. ఆ పాటలో తడిచి ముద్దయిన చిరు జీవి.... చిరంజీవి

 

 

 

డా|| నోరి రాజేశ్వరరావు

 

 

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon