• చిగురుకల కు స్వాగతం

చిల్లరదేవుళ్లు

పాట కచేరి

జీవిత ప్రయాణం అనేక దూరాలు కొలమానాల మధ్య సాగుతుంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని తీపి చేదు జ్ఞాపకాలు నీలినీడలుగా వెంటాడుతుంటాయి. ఈ దూరాలు బహు భారమయినా ప్రతి అడుగులోనూ, ప్రతి నడకలోనూ ఏదో కొత్తదనం ఎదురవుతుంటుంది. కొన్ని కలవని దూరాలు రసరమ్య గీతాలుగానూ, సమాధానం అందని పొడుపు కథలుగా మనం చూస్తుంటాము.

 

అసలు దూరం అనేది మనిషి మధ్య ఒక భేదంలాంటిది. కొన్ని దూరాలు అవసరాలకోసం ఏర్పడే సంక్షభాలు. ఈ దూరాలకు సూత్రధారి, పాత్రధారి మనిషి, సృష్టికర్త మూల బిందువులు.

నిన్నటి జ్ఞాపకాలలో పెరిగిన దూరం మన మనోఫలకం మీద అందమైన ముఖచిత్రంగా వుంటుంది. అంది గుండెగుడిలో పెంచుకొన్న మమతలకోవెల అనుకుందాము. అనుక్షణం మనకు ఇష్టమైనవారి గురించి తలంచుకొన్నప్పుడు వారిపట్ల కలిగే ఆకర్షణ అనురాగం కావచ్చు. నీరిక్షణలో కలిగే తీపి బాధ విరహం కావచ్చు. అది ఎలా ఉంటుంది అంటే అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప. అది మాటలకు అందని రసాయనిక చర్యగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఆ చర్య మాత్రం ఆత్రేయ పాటలో 'కలువను, చంద్రడ్ని.... కమలాన్ని, సూర్యుడ్ని అడిగిచూడమంటాడు.... చిల్లరదేవుళ్లు చిత్రం ద్వారా....'

 

ఈ కృత్రిమ ఆకర్షణలకన్న నిజమైన ఆకర్షిక భావన అనేది 'అనురాగంలోనూ, విరహంలోనూ' ఉన్నది ఒక మనిషి జీవిత చిత్రం అంటాడు.

 

ఈ ప్రేమ వికర్షణకు సూత్రం విరహం ఎలాగో .... ఆ రెండిటి మధ్య వారధిగా నిలిచేది నవ్వు.

 

నవ్వును పాజీటీవ్‌, నెగిటీవ్‌ దృక్పధంతోనూ చూడవచ్చు.

 

'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని.... ఒకరంటే'. 'నవ్వుతు బ్రతకాలిరా తమ్ముడు... నవ్వుతూ చావాలిరా తమ్ముడు...' నలుగురిలో నవ్వులపాలు కాకుండా. ముఖం మీద నవ్వు వెన్నెలసోనలా విప్పరాలి.మనిషి జీవితంలో కన్నీళ్ళు, నవ్వు వ్యతిరేక పదాలు కావచ్చు. తూర్పు పడమర దృక్కులు కావచ్చు.

 

'నవ్వు నవ్వుకు తేడా వుంటుంది

నవ్వే అదృష్టం ఎందరికుంటుంది'

 

మనిషి నవ్వులో ఉండే తిరకాసు గురించి మాట్లాడుతూనే. కొందరి మోహలూ అమావాస్య చంద్రులుగానే ఉంటాయి. అందుకే జంధ్యాల అంటాడు.

'నవ్వడం ఒక యోగం

నవ్వించడం ఒక భోగం

         నవ్వకపోవడం ఒక రోగం' అని.

 

కొందరి నవ్వు పిల్లతెమ్మరలా ఉంటే. మరికొందరి నవ్వు 'నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే' వస్తాయి అంటాడు ఆత్రేయ.

 

నవ్వు ఆనందానికి ట్రేడ్‌మార్కు అయితే విషాధానికి ట్రేడ్‌మార్కు కన్నీళ్లు.

 

' ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది

అది కలిమి లేముల్ని మురిపిస్తుంది' అంటాడు.

 

కన్నీరు అనేది బాధ నుండి ఉత్పన్నమయి ఎగసిపడిన అల. ఆ అల కనులను తడిపి హృదయవేదనను దూరం చేస్తుంది. కానీ నేటి కలియుగ కన్నీళ్లలో ఎదుటివాడిని చూసి ఏడ్చేవారు కళ్ళు తడవవుకానీ, ఎదుటివారి కన్నీరు పెట్టుకొంటే ఆనందించేవారు ఉన్నారు. ఈ ఆనందంవారి అజీర్తి రోగానికి ఉపశమనం కలగిస్తుందని వారి నమ్మకం.

 

 ఈ నవ్వు నుండి ఊహాల ఉయ్యాల ఎక్కి అలా ఆకాశం అంచులు తాకి వద్దామని అనుకున్నారు. ఇంతలో మీ కలలో ఒక అందమైన రాకుమారి కనిపిస్తుంది ఆమె మీద కలిగిన ప్రేమ తలంపు ఎలా ఉంటుంది.

'వలపు కన్నా తలపే తియ్యన

కలయిక కన్నా కలలే తీయన'

 

అనే భావన వయసును శృతి చేసే అందమైన భావన. మనసును రంజింపజేయడమే కాదు. వయసును మొత్తేక్కిస్తుంది.హుషారుతో హంగామా చేస్తుంది.

 

ఇంత ఆనందంలోనూ భవిష్యత్తు మీద ఆశలు, ఎదురుచూపులు కలల ఇంద్రచాపం విసురు పున్నమి వెన్నెలలా ఉంటుంది.

 

ఆత్రేయ మాత్రం నిరీక్షణలో ఉన్న ఆనందం వెతుక్కోమంటాడు-

 

'చూపులకన్నా యెదురు చూపులే తీయనా

నేటి కన్నా రేపే తీయనా' అంటాడు.

 

ఈ రేపటి ఆలోచనే మనిషి శ్వాస, ధ్యాస. నేడు నిజం కాకపోయినా, రేపు తప్పక కలల పంట పండుతుందనే ఆశ మనిషి అంతరంగాన్ని చిరంజీవని చేస్తుంది. దీనికి ఎలాంటి ఫలాలు, ప్రతిఫలాలు అక్కరలేదు. మనిషి నమ్మకం, అతని ప్రయత్నం సరికొత్త దారులకు బాటలు వేస్తుంది.

 

ఈ విభిన్న పార్శవాల జీవితంలో మనిషి నడిపే సూత్రం మనసు. మనిషికి చుట్టరికాలు, బంధుత్వాలు దూరం కావచ్చు కానీ మనిషి చివరి అధ్యాయం వరకు తోడుగా ఉంటుంది మనసు.

 

'మనసు మనిషిని మనిషిగ చేస్తుంది

వలపా మనసుకు అందానిస్తుంది'

 

మనసు - మనిషికి అద్దంలాంటిది. అది ప్రేమపాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. ఒకవేళ ఆ మనసు అనేది లేకపోతే మనిషి. నవరసాలు ఆస్వాధన తెలియదు. మరబొమ్మగా మిగిలిపోతాడు.

 

ఒకవేళ మనసు అనేది దేవుడికి లేకపోయినా, మనసు మార్కటమయినా,  మనిషి అవతల తీరం చేరేవరకు మనసు అనేది తోడు కావాలి.అది నీడ కావాలి.

 

' ఈ రెండూ లేక జీవితమేముంది

ఆ దేవుడికే మనిషికీ తేడా ఏముంది' అనే....

 

జీవన సత్యాన్ని మనిషి జననం నుండి మరణం అంచుకు చేరేవరకు ఈ మజిలీ అంటూ తన పాట ద్వారా ఉద్బోధిస్తాడు ఆత్రేయ.

 

ఈ పాట అలతి పదాలతో అనంత జీవన సత్యాలను విశ్లేషించారు.

 

 

 

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon