• చిగురుకల కు స్వాగతం

దసరా

దసరా భక్తజనలకు ఆసరా !



'' నిరతము మాకు నీడగ నిలిచి

జయము నీయమే అమ్మా భవానీ''

అని సకల భక్త జనం అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకి అయిన త్రి పుర సుందరిని మనసా, వాచా కర్మణా భక్తి ప్రపత్తులతో పూజించడం జీవిత పరమార్ధమైతె. నవరాత్రుల ప్రత్యేక సేవాలంకృతుల ద్వారా అమ్మవారిని దర్శించి, తరిస్తారు భక్తులు. ఇది దసరా పండుగ ప్రత్యేకత.

ఆశ్వీజ మాసంలో నవరాత్రులలో రోజుకొక రూపంతో అమ్మవారు దర్శనమిస్తుంది. చల్లని నవ్వుల దీవెనెలు అందించే తల్లి

'' సుమనసువందిత సుందరి మాధవిచంద్ర సహోదరి హేమమయి'' అని మహాలక్ష్మిగా రూపం దాల్చి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 'జయలీలా సుకప్రియె' అని వీణావాద్య వినోదిని వాగ్ధేవిగా దర్శనమిస్తుంది.

శరన్నవ రాత్రుల ప్రారంభం తొలి రోజున ఆశ్వీజ శుక్ల పక్ష పాడ్యమి రోజున అమ్మ పసుపుతో అభ్యంగన స్నానం చేసి తదుపరి సర్వాభరణభూషితగా కనువిందు చేస్తుంది. ప్రతి రోజు ఒకొక అవతార రూపంలో కనిపించి, భక్తజనులను ఆశీర్వదిస్తుంది.

''అన్నపూర్ణే సదా పూర్ణె శంకరప్రాణవల్లభే'' అని అన్నపూర్ణ రూపం ధరించి భక్తులకు ధాన్యరాసులను ప్రసాదిస్తుంది.

రాజరాజేశ్వరిగా సకల కళామూర్తిగా భాసిల్లుతుంది. గజలక్ష్మిగా సౌభాగ్యదాయనియై కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమయి, బిడ్డలకు సకలసౌభాగ్యాలను నొసుగుతుంది.

''యాదేవి సర్వ భూతేషు శాంతి రూపేణ సరస్తితా'' అని జనులచే స్తుతించబడుతుంది.

కుంకుమ పూజలంది ఐదోతనాన్ని తన పుత్రికలకు అందజేస్తుంది.

ప్రతి అవతార పరమార్ధం భక్త జనుల శ్రేయోహితమై, సృష్టి ధర్మాలను కాపాడడమే. అంతేకాకుండా సహస్ర కోటి నామములతో పూజలందుకునె తల్లి ఏ పేరుతో పలిచినా ఆ తల్లి తన కరుణకటాక్ష వీక్షణలను ప్రసరిస్తుంది. ప్రతి పేరులోనూ ఎంతో అర్ధవంతమైన మంత్రోచ్ఛరణ దాగివుంది.  భ్త జనం దుర్గ, భవాని, వాగ్దేవి, అని పలు పేర్లతో పిలచినప్పటికి, ఆమె నామాలు వేరు కావచ్చు కానీ, రూపం మాత్రం ఒకటే...

అమృతమూర్తిగా పాయసాన్ని, భోజన ప్రియగా భక్తుల ప్రసాదం స్వీకరించి తరింపజేస్తుంది. తల్లి దీవెనల కోసం భక్తులు పిలుస్తుంటారు.

''శ్రీమాత లలిత ప్రసన్నా వదనా

 శ్రీ రాజ రాజేశ్వరీ ...............

....................................''

మరి కొందరు భక్తులు

దుర్గాంబ నవకోటి మూర్తి సహిత

మాంపాతు మహేశ్వరి'' అంటూ పలు విధాలుగా ప్రస్తుతిస్తారు.

దసరా నవరాత్రి ఉత్సవాలలో  అత్యంత ప్రీతి పాత్రమైవి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పర్వదినాలు. దుర్గాదేవి మహిషునితో పోరాడుతూ వానిని అణచె తరుణంలో నవదుర్గ, వనదుగ్గా, కాళరాత్రి, భవాని, శ్యామల, మంగళి మొదలైన దేవతల శక్తులను తనలో నిక్షిప్తంచేసుకొని మహిషుని అణచివేసింది. విజయాలను తన సొంతం చేసుకుంటుంది.

అష్ఠాదశ పీఠ శక్తి రూపాలలో పూజలందుకునె అమ్మ నవరాత్రలయందు తేజోమూర్తిగా దర్శనమిస్తుంది.

తెలంగాణలో బతుకమ్మగా వాడవాడల ప్రజల పూజలందుకొంటుంది.  ఈ బతుకమ్మ పండుగ రాష్ట్ర అవిర్భావం అనంతరం అధికారిక పండుగగా గుర్తించబడింది.

విష్ణువులాగే సార్వతీ దేవి దశరూపాలు దాల్చిందనీ, ఒకొక్క అవరతంలో దేవి లోక కళ్యాణం కోసం దనుజులను సంహరించి, ప్రజలకు బాసటగా నిలిచిందని పురాణాలు తెలియజేస్తున్నాయి.

అమ్మ తన తొలి అవతారంలో 'మధుకైటభులు'' ను సంహరించింది. రెండవ అవతారంలో 'మహిషుని', మూడవ అవతారంలో 'శుంభనిశుంభలను' వధించింది. నాల్లవ అవతారంలో 'యోగమాయ'గా కంసుని మరణానికి కారణమైంది. ఐదవ అవతారంలో ధనుజుని దంతాలతో చీల్చి 'రక్తదంతి' అయింది. ఆరవ అవతరంలో 'శాకాంబరి'గా మారింది. ఏడవ అవతారంలో దుర్గుడనే దైత్యుని అంతమోదించి 'దుర్గాదేవి' అయింది. ఎనిమిదవ అవతారంలో మాంతంగి గానూ, తొమ్మిదవ అంతారంలో  

భ్రామరిగానూ భక్తులకు దర్శనమిస్తుంది.మార్కండేయ పురాణంలో దేవి మహత్త్యంలో శాకాంబరి ప్రస్తావన వుంది



తెలంగాణలో శరన్నావరాత్రులలో ఆశ్వయిజ పాడ్యమి నుండి నవమి వరకు బతుకమ్మ పండుగ జరుగుతుంది. ఇది స్త్రీల పండుగ. అయితె దీనికి ముందు భాద్రపద బహుళ పంచమి నుండి  మహాలాయ అమావాస్య వరకు 'బొడ్డెమ్మ' పండుగ చేస్తారు. ఇది బాలికలు, కన్యల పండుగ.బొడ్డెమ్మ అనే పేరుకు బొట్టి, బొడివ, పొట్టి అనే పర్యాయపదాలున్నాయి.



శ్రీచక్రంలో త్రిపుర సుందరి ప్రతి రూపమైతే మేరు ప్రస్తారం బతుకమ్మ. ఈ బతుకమ్మ ఆరాధనలో శక్త్యారాధన, తంత్ర, యంత్ర, శాస్త్ర పరిజ్ఞానం, ప్రకృతి ఆరాధనాంశాలు కన్పిస్తాయి. అందుకె బతుకమ్మను చేసె విధానంలో వస్తు సంప్రదాయంలో భాగంగా గుమ్మడి ఆకులు, ముత్యాల పూవు, గునుగు, తంగేడు పూలను వాడ్తారు. త్రికోణాకరంగా పేరుస్తారు. పెద్దగా పేర్చిన దానిని తల్లి బతుకమ్మ అనీ, చిన్నగా పేర్చిన దానిని పిల్ల బతుకమ్మ అంటారు. సద్దుల ఆహారం ఈ పండుగలో ప్రాధాన్యతను సంతరించుకొంటుంది.

ఏది ఏమైనా చల్లని తల్లీ, వరాల తల్లి అయిన దుర్గమ్మ భద్రకాళియైనా, బతుకమ్మ అయినా చూసె చూపు ఒక్కటే . ఆ తల్లి వైపరిత్యాలను ప్రజలను రక్షించడం కోసం తన చల్లని చూపులను ప్రసరిస్తుంది.

ప్రతి ఏటా దక్షినాయణంలో ఆశ్వాజమాసంలో అరుదెంచె దసరా పండుగ. అమ్మవారు నవ రూపాలలో  భక్తులకు దర్శనమిచ్చి, ఆమె శరణుకోరినవారిని కొండంత అండగా నిలుస్తుంది.



                                                  ......డా|| నృసింహ






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon