• చిగురుకల కు స్వాగతం

మంగమ్మ చీర

మంగమ్మ చీర !

 

 జీవితం ఒక ప్రవాహం ఎనెన్నో మలుపులు తిరుగుతూ ఎక్కడో ఆగిపోతుంది. అది ఒక చోట ఆగిపోయేవరకు ఎందరో కలుస్తుంటారు, దూరమౌతుంటారు, విడిపోతుంటారు. కారణాలు ఏమైనప్పటికి కొందరు మన జీవితం ఆఖరి పేజీ వరకు గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయేవారే ఆత్మీయులు.

 

అలాంటి ఆత్మీయులు మీకు తారసపడుతుంటారు. మరచిపోతుంటారు. ఎప్పుడో ఒకసారి అనుకొకుండ ఎదురుపడిన జ్ఞాపకంగా గుర్తుచేస్తుంటారు.

 

అలా వాసంతికి మిగిలిన జ్ఞాపకం మంగమ్మ. మంగమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆమె బాల్యం గుర్తుకు వచ్చేది. ఆమెకు గలగలపారే పిల్లకాలువలాంటి ఆమె పల్లెసీమ గుర్తుకు వచ్చేది.

 

వాసంతి సీతాకోకలా రెక్కలు తొడగగానే..... పెళ్లితో తన ఇంటిపేరుతో పాటుగా చిరునామా మారింది. దూరం పెరిగింది. తన ఇష్టమైనవారికి, కన్నవారికి దూరమైంది.

 

వాసంతి అత్యంతంగా అభిమానించేది మంగమ్మను. ప్రతిసారు తన ఊరువారు ఎవరు వచ్చినా మంగమ్మ గురించి అడిగి తెలుసుకొనేది.ఆనందించేది.

 

ఆ రోజు మాత్రం ....

 

వాసంతికి మంగమ్మ లేదని వార్త తెలిసింది

 

ఆమె రూపం చెరిగిపోయిందని,ఆమె మాట కనుమరుగయిందని తెలిసినప్పుడు. మనసంతా వికారంగా మారింది. ఆమెకు అంజలి ఘటిస్తునట్లుగా ఆమె కంటి నుండి రెండూ కన్నీటి చుక్కలు ఒలికిపోయాయి. వాపంతికి ఇక ఆమె ఒక  మిగిలిన జ్ఞాపకం...

 

  ఆమె లేకపోతేనేం, ఆమె బహుమతిగా ఇచ్చిన చీరను తీపి గుర్తుగా భద్రపరుచుకొవాలని వాసంతి నిర్ణయించుకొంది.

 

ఆ ఉదయం బంధువులు వచ్చి పలకరించి ఈ వార్త చెప్పి వెళ్లారు. ప్రతిసారి బంధువులు ఆనందం తీసుకొచ్చేవారు కానీ, ఈసారి విషాదం మిగిల్చారు అనుకొంది ఒక క్షణం.

 

అమ్మ నాన్న నా మనసును కష్టపెట్టడం ఇష్టంలేక ఈ వార్తను దాటవేసేవారు. మరో నిమిషంలో వాళ్లు చెప్పకపోతే మరి ఆ కబురు నాకు ఎవరూ చెబుతారు అనుకొంది.

 

నిజానికి ఆమె పెళ్లితో ప్రతి ఒక్కరు జ్ఞాపకాల జాబితాలో చేరిపోయారు. కొందరు గుర్తున్నారు. మరికొందరు చెరిగిపోయారు. ఎప్పుడన్న తల్లి ఫలాన అని గుర్తు చేస్తే ఆమెకు అంతా గజిబిజిగా ఉండేది. చివరకు వాళ్ల అనవాలు కోసం వారి చిరునామా తదితర విషయాలు అడిగి తెలుసుకొని.... గుర్తు చేసుకొనేది.

 

అందుకే బంధువులు వస్తున్నారంటే తన ఊరు తన ఇంటికి  వచ్చినంతగా సంబరపడుతుంది వాసంతి.

 

తన వూరు వాళ్లను చూసినప్పుడల్లా నేస్తాలతో చేసిన అల్లరి జ్ఞాపకాలు గిలిగింతలు పెడుతుంటాయి.

 

వాళ్లు చుట్టం చూపుగా చూసివెళ్లడానికి వచ్చినప్పుడు... తన ఆనందాలకు హద్దులు ఉండవు. తను చిన్నపిల్లలా కేరింతలు కొడుతుంది. తన వయసును కూడా మరచిపోతుంది. ఆ ఆనందం కృత్రిమమైనది కాదు.వెలకట్టి కొనేది అంతకన్న కాదు.

 

అలా నాలుగురోజులు ఉండి వాళ్లు వెళ్లిపోతుంటే. ఏదో తెలియని బాధ. బడిపిల్లలు సెలవులయిపోయిన తర్వాత స్కూలుకు వెళ్లలంటే బిక్క మెహం పెట్టిన పిల్లవాడిలా వుంటుంది ఆమె పరిస్థితి... తనకు ఆనందం కలిగించి ధారవాహిక భాగం కొల్పోయినంతగా బాధపడేది. 

 

వాసంతికి డబ్బులతో కొలిచే ఆనందం ఉంది. ప్రేమానురాగాలు పంచే భర్త మరో పక్కన వాళ్ల ప్రేమకు కానుకగా ఇద్దరు పిల్లలు అనుక్షణం తల్లి చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ అల్లరి పెడతారు. 'నేను మీ అమ్మను మాత్రమే అంటూ అక్కున చేర్చుకునే అత్తగారు.ఆత్మీయ అనుబంధాలకు మరుదులు, తోడికోడళ్లు ఆమె కనురెప్పలుగా ఉంటారు. అది అందమైన పూ పొదరిల్లు మాత్రమే కాదు. ఉమ్మడి కుటుంబంలో కలసి ఉండే ప్రేమానురాగాలను గుర్తుచేస్తుంది. అయినా ఏదో తెలియని వెలితి ఆమె మనసును తొలిచివేస్తుంటుంది. జీవితం యాంత్రికంగా ఉంటుంది. రంగారెడ్డి గుండెల మీద గువ్వపిల్లలా ఒదిగిపోయినా, జీవితం పసిడిపంజరంలో బంధిగా ఉన్నట్లుగా ఉంటుంది.

 

తన ఊరు గలగలపారే ఏరులా ఉంటుంది. దాని సవ్వడి ఎవరో అనాముఖ సంగీతకారుడు రాగాలాపనలా ఉంటుంది. చిన్న కుటుంబం చింతలులేని కుటుంబం పల్లేసీమకు అద్దం పడుతుంది.

 

ప్రతి ముఖం పాతదే, పరిచయం ఉన్నదే, బాబాయి, పిన్ని, అత్త, మావ అన్న ఆత్మీయత నిండిన పలకరింపులు, కుటుంబాలు వేరుకావచ్చుకానీ, ప్రతి ఇంటి గుమ్మం ముందు ముత్యాల ముగ్గులు ప్రోది చేసుకున్నట్టు. ప్రతి ఒక్కరు సాయం సంధ్యవేళ అరుగుల మీద కూర్చుని పలకరింపులు, బాదం చెట్టు నీడలో పిల్లగాలి సవ్వడులు, అమ్మ కలిపి పెట్టిన గోరుముద్దలు,నాన్న మౌనంగా పడకకూర్చిలో కూర్చుని మా పిల్లల అల్లరి చూస్తూ వరిసి విరియని పెదవుల మధ్య తళుక్కున మెరిసి మాయమయ్యె నవ్వు ఎన్నటికి మరచిపోలేదు. ఊరు అంతా ఒకే కుటుంబంలా పండుగ కోలాహాలంలా ఉంటుంది. చిన్నారి అంటూ అప్యాయంగా పలకరించే తేన పలుకులు, ఆ పలుకులకు పుప్పోడి అద్దుతూ చాకలి మంగమ్మ 'బంగారు తల్లి ! నీ  కురులు పాయలు పాయలుగా చీలి ఎంత ఒయ్యారాలు పోతునాయి. నువ్వుతలంటి చేస్తూ కూనీరాగాలు తీయడం ఎంత బాగుంటుంది, అది మంగమ్మకు సరదాగా వుంటుంది.

 నేను నీటిలో చేప పిల్లలా ఈదులాడాలనుకొన్నాప్పుడు, తడిలో వద్దు తల్లి అని తడిచిన తలను తుడుస్తూ జలుబు చేస్తుంది తొందరగా తడి ఆరనియమని, నీకు పూల జడ వేస్తాను మహారాణిలా ఉంటావు అని ఆశపెట్టడం అమ్మలాంటి మంగమ్మకు చెల్లిన జ్ఞాపకం  నిన్నటి జ్ఞాపకాల చిట్టగా మిగిలిపోయింది.

 

నా చిలిపితనం అల్లరికి చెల్లు అన్నట్లు, నా వొంటి మీద కొత్త అందాలు అలంకరించుకొన్నాప్పుడు నేను ఆడపిల్లను అనే సంగతి కాలం జ్ఞాపకం చేయడమే కాదు. బంధువులు ఎన్నో బహుమతులు ఇచ్చారు. మంగమ్మ మాత్రం నా మనసు ఎంత తెల్లగా ఉంటుందో చూడు తల్లి అంటూ ఒక మల్లేపువ్వులాంటి తెల్ల చీర చేతుల్లో పెట్టి పిల్లపాపలతో కాలకాలం సుఖంగా ఉండమని, తన ఆయుషు కూడా పోసుకొని వర్థిల్లమని దీవించింది. ఆమె కంట్లో సన్నని కనీటి పోర నా కంటికి మాత్రమే కనిపించింది.

 

మంగమ్మకు నా మీద ఎందుకు అంత అపేక్ష అనేది తర్వాత తెలిసింది. మంగమ్మ బోసి మెడకు పసుపుతాడు కట్టినవాడు, పసుపు కుంకుమలు అందించినవాడు మొగుడు, మగాడు. మంగమ్మంటే ప్రాణం. మొగుడన్న మంగమ్మకు అదే రకమైన ప్రేమ. కానీ, వారి ప్రేమకు సాక్ష్యంగా సంతానం కలుగలేదు. పిల్లలు లేరని బెంగపడటంకన్న నలుగురి పిల్లలకు సేవచేస్తే ఆ పైవాడి జాలి పడతాడని. పిల్లల బట్టలు ఉతకడం దగ్గర నుండి, వాళ్ల అలనపాలన తానే తల్లిగా చూసేది. ఊళ్లో వాళ్లు కూడా మంగమ్మను ఎంతో అభిమానించేవారు. అయమ్మ అంటూ ఆత్మీయంగా పిలిచేవారు పిల్లలూ.మంగమ్మ కడుపు మాడ్చుకొని పైసా పైసా కూడబెట్టి చిన్న పిల్లల వేడుకలలో వాళ్లకు తనకు తోచిన బహుమతులను అందించి సంతోషపడేది. ఎవరన్నా భగవంతుడు నీ మీద చిన్న చూపు చూసాడని జాలిపడితే. నేను గొడ్రాలిని ఎంత మాత్రం కాదు. భగవంతుడు దయామయుడు కాబట్టే నాకు ఇంతమంది పిల్లలను చూపించాడు అని ముసిముసి నవ్వులు నవ్వేది.

 

నువ్వుపెద్దమనిషివనే సంగతి గుర్తు చేస్తూ వేడుక జరిపినప్పుడు.... మంగమ్మ నాకు తెల్ల చీర బహుమతిగా ఇవ్వాలని కలలు కంది కాబోలు. తెల్లచీర ఆడపిల్ల జీవితంలో రెండూసార్లు కడుతుంది. మొదటిసారి పెళ్లిలోనూ, ఆ తర్వాత కట్టుకున్నవాడు దూరమయినప్పుడు. నిజానికి ఆ చీర అందంలో ఆనందం, విషాదం రెండూ సమపాళ్లలో ఉన్నాయి. ఆ చీరలో నన్ను చూసి మా 'వాసంతమ్మ వెన్నెలలా మిలమిలలాడిపోతుంది' ఈ అందాల బొమ్మ చేతిని పట్టుకుని అల్లుకుపోయేవాడు ఎవడో అని అల్లరిచేసి, నా దిష్టే తగిలేను అని మొటికలు విరిచింది.

 

వాసంతి తెల్లని బుగ్గలు ఎరుపెక్కయి.... ఆ ఎరుపు బుగ్గలు గులాబీ పూలలా ఉన్నాయి. ఆ గులాబీకి ముళ్లు ఉన్నట్లుగానే, ఆడపిల్ల జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక ముల్లు గాయపరుస్తూనే ఉంటుంది.

 

వాసంతికి చిలిపి ఆలోచన కలగకపోలేదు. నేను వెన్నెల్లా ఉంటే... ఈ వెన్నెల్లో సైఆటలు ఆడేవాడు ఎవడు. నా ఆనందానికి అడ్డుగోడకాడు కదా? అనే ప్రశ్న కాస్తంత దిగులు కలిగింది. వాసంతి ఆలోచనలకు ఎలాంటి సంబంధం లేదు. 

 

 బంధువులు మాత్రం విందు వినోదాలతో సందడి చేసి, అమ్మ,నాన్నకు ఎన్నో సలహాలు,సూచనలు ఇచ్చారు. నీ ఆనందానికి త్వరలోనే పెళ్లి అనేది ఆడపిల్ల జీవితంలో  చెలియాలికట్ట అవుతుందని. అమ్మ నాన్నకు చుట్టం చూపుగా మిగిలిపోతావు అని అల్లరిగా అన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. మనసు విలవిలలాడిపోయింది.

 

వయసు పెరగడం, కాలం కరిగిపోవడంతో పెరిగె బాధ్యతలు, మారిపోయే చిరునామాలు, ముఖ్యంగా సొంత ఇంటిని వదిలి మరో పంజరంలోకి వెళ్లడం అనేది బంధీ కావడమే అనిపించింది వాసంతికి.   ఎన్ని ఆనందాలు ఉన్నా  మనసుపోరల్లో ఒక జ్ఞాపకం చెరిగిపోని గాయంలా మిగిలిపోతుంది.

 

 పెళ్లి వేడులు కొంత ఆనందాన్ని, మరి కొంత సంశయం మధ్యన  వాసంతి దీర్గాలు అత్తవారింట అడుగుపెట్టింది. అక్కడ బంధువులు ఎన్ని బహుమతులిచ్చినా.... ఆ బహుమతులు ఎంత మాత్రం సంతృప్తినివ్వలేదు. ఆ చీరను వెంట తీసుకొని వెళ్లుతున్నప్పుడు 'ఆ పాత చీర ఎందుకని' అమ్మ దీలు తీసింది. కానీ, వాసంతి ఒక చిరునవ్వు నవ్వి వదిలేసింది. తన తోడుగా మంగమ్మ చీరను తెచ్చుకొంది. ఆ చీరను తడిమినప్పుడల్లా మంగమ్మ తనను ముద్దడినట్లుగా ఉండేది. అది కట్టుకుంటే ఎక్కడ చిరుగుపడుతుందో అనే భయం. అందుకే దానిని జాగ్రత్తగా బీరువలో భద్రపరిచింది.

 

ఆ చీరను చూసినప్పుడల్లా.... పెదవుల పై ఒక చిరునవ్వు మెరిసి మాయమైపోయేది. నేను ఇంటి పంజరంలో బంధినీ, నువ్వు నా బట్టల బీరువలో బంధీవనట్టుగా ఆ నవ్వులో అంతరార్ధం.

 

వాసంతికి పెళ్లాయి పది సంవత్సరాలయిన తన అలవాట్లు మారలేదు.

 

వారంలో ఒకసారైన ఆ చీరను చూసుకొని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంబరపడిపోతుంది.

 

ఆ రోజు ఉదయం-

 

పనులన్ని పూర్తి చేసుకొని అందరిని సాగనంపి ఆ తర్వాత-

 

ఒంటరితనం వెంటపడి వేధించసాగింది.  ఆ ఒంటరితనం నుండి బయటపడటం కోసం బీరువ తెరిచింది మంగమ్మ చీరకోసం వాసంతి.

 

బీరువాలో ఆ చీర మాత్రం కనబడలేదు. ఇది ఊహించని పరిణామం. ఆ చీర కనపించకపోవడంతో ఆమె మనసు విలవిలలాడిపోయింది.

 

ఆ చీర చేజారిపోవడమంటే... తిరనాళ్లలో అమ్మ చేయి వదిలి దారి తప్పినట్టుగా అనిపించింది.

 

సమయం గడిచిపోతుంది. ఇల్లు నలుమూలలా వెతుకుతుంది. తనను తాను నిందించుకొంటుంది.

 

చీర జాడ మాత్రం కనిపించలేదు.

 

వాసంతి కళ్లు కన్నీరయ్యాయి. ఎర్రమందారాలయ్యాయి.

 

కడుపులో ఆకలి దహిస్తుంది కానీ అన్నపు ముద్ద మింగుడుపడేలా లేదు.

 

ఆ చీరను ఎవరో కావలని తీసారనే అనుమానం కలిగింది. ఆ చీర తీసింది ఎవరూ? 

 

@@@@@

 

భర్త సాయంత్రం ఇంటికి వచ్చి పలకరించినా ముభావంగానే ఉంది.

 

రంగారెడ్డి పలకరించాలని ప్రయత్నించినా.... మౌనమే తన సమాధానం అన్నట్టుగా కూర్చుంది.

 

రంగారెడ్డికి,  భార్య అలకకు అర్ధము కాలేదు. పెళ్లాయిన ఇన్ని సంవత్సరాలలో ఇలా భీష్మించుకుని కూర్చోవడం అనేది ఆశ్చర్యంగాను వింతగాను ఉంది. ఏ రోజు తనతో గిల్లికజ్జాలు పెట్టుకున్నది లేదు.ఎన్నోసార్లు తనకు కోపం తెప్పించాలని ప్రయత్నించినా, అది మీ వల్లకాదు అంటూ  సర్దుకుంటేనే సంసారం చక్కబడుతుందని చెప్పేది.

 

రాత్రి భోజనం చేయకుండానే వాసంతి పడుకోవడం రంగారెడ్డి మనసు కలతచెందింది.

 

వాసంతి చీర సంగతి భర్తను అడగలనుకొంది. కానీ, ఎందుకో మనసు అంగీకరించలేదు. కళ్లు మూసుకొంటే నిద్రపట్టడం లేదు.

 

రంగారెడ్డి  భార్య గురించి ఆలోచిస్తూ కళ్లు మూసుకొన్నాడు. కానీ నిద్రపట్టడం లేదు.

 

రామకృష్ణ ఒక నిర్ణయానికి వచ్చినవాడులా- 'వసూ ఎందుకురా కోపం? నా వల్ల ఏదైన తప్పు జరిగితే చెప్పు- నువ్వు అలా బాధపడుతుంటే... నాకు ఎంత బాధగా ఉంటుంది. నువ్వు నిద్రపోవడం లేదని తెలుసు. నాకు నిద్రపట్టడం లేదు'అన్నాడు.

 

భర్త మాటలకు వాసంతి కంటి రెప్పల చెలియాలకట్టను తెంచుకొని కన్నీరు ఒక్కసారి ఎగసిపడింది. భర్తను లతలా అల్లుకుపోయి బిగ్గరగా ఏడవసాగింది. ఆమె ఏడుపు కుదటపడేవరకు ఆగి రంగారెడ్డి .

 

విషయం నాకు చెప్పందే ఎలా తెలుస్తుంది రంగారెడ్డి అన్నాడు. వాసంతి వెక్కిళ్ల మధ్యన తన తెల్లచీర కనిపించడంలేదు అంది.

 

రంగారెడ్డి  ఒక్కసారి ఉలిక్కిపడి లేచి వెళ్లి. బీరువ అర తెరిచి. తెల్లచీరలో చుట్టిపెట్టిన నోట్ల కట్టలను అరలో సర్థిపెట్టి. వాసంతి  చేతిలో ఆ తెల్లచీరను పెట్టి. నన్ను క్షేమించాలి. ఉదయం ఎవరో బాకీ డబ్బు తెచ్చి ఇచ్చారు. అందులో చుట్టి లోపల పెట్టాను అన్నాడు.

 

వాసంతి ముఖంలో మబ్బులు తొలిగిపోయి వెన్నెల కురవసాగింది. 'పిచ్చి వసూ! ఈ చీర నీకు అంత ప్రాణప్రధమైతే- నాకు అంతేరా' ఈ విషయం నన్ను అడిగితే సరిపోయేది కదా అన్నాడు. ఒకవేళ ఆ చీర మీకు కనిపించకపోతేఅంది వాసంతి.

 

మరో తెల్లచీర తెచ్చి కట్టబెట్టేవాడిని అన్నాడు.

 

ఈ చీర నా ప్రాణం అంది వాసంతి.

 

వాసంతిని కౌగిలో బంధీని చేస్తూ నువ్వు నా ప్రాణం అన్నాడు.

 

వాసంతి పౌర్ణమి వెన్నెలలా నవ్వింది.

 

రంగారెడ్డి  కళ్లు మూసుకొని ఒక తియ్యని కలలో ఊయలలూగసాగాడు.

 

 

...........డాక్టర్  నృసింహ

 






tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon