• చిగురుకల కు స్వాగతం

సినీ అష్టదిగ్గజాలు

ఆరుద్ర పాటలో ఓలలాడిన రామయ్య !
మొదటి అడుగు
Arudraవర్ణాలలో 'ఆ' దీర్ఘవర్ణం. 'రామాయణం' దీర్ఘ కావ్యం. రామాయణం ఆదికావ్యం. ఆ - ఆదికావ్యానికి నాయకుడు రాముడు. ఆ రాముని మూర్తిమత్వం 'అందాల రాముడు, ఇందీవరశ్యాముడు, ఇనకులాబ్దిసోముడు'' అని కీర్తించిన ఘనత ఆరుద్రకే చెల్లింది. 1925-1998 మధ్యకాలంలో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రతో శాశ్వత కీర్తినార్జించారు.  ఆరుద్ర అని అందరికి తెలిసిన పేరు.(భాగవతు సదాశివ శంకర శాస్త్రి)గా కొందరికి మాత్రమే సుపరిచితులు.

ఆరుద్ర తెలుగు సాహిత్యానికె పరిమితం కాలేదు. ఇంద్రజాలం,చదరంగం, నాట్యశాస్త్రం,నాటకం, డిటెక్టివ్‌ నవల, మధ్యాక్కుర, వ్యాకరణం, సినిమా, కథ, పాట, మాట ఇలా బహుముఖీనమైన పాత్రలు పోషించారు. కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు ద్వారా  అందరివాడయ్యాడు.

బాపు రమణల స్నేహ పల్లకిలో తారలను క్రిందకు దించిన వైనం ఆరుద్రది. అందుకే 'ఆకాశం దించాడు, నెలవంక తుంచాడు, సిగలో వుంచాడు' సాహితీ శిఖరమై ఎదిగాడు.

ఏ పాటైన తన కలం నుండి వేదంలా ఘోషించే గోదావరి అని అది మీ నోట పలకరిస్తుంది అటు లలిత గీతాలు,క్లబ్బుపాటలు, చలిపితనం అల్లరి చేసిన పాటల విందు చేసినా... పాట మాత్రమే కాదు నా మాటకు తిరుగులేదంటూ రెండుసార్లు సంపూర్ణ రామాయణం సినిమాకు మాటలందించారు.

''మల్లాది వారి గురు ఆశ్రమంలో ఎదిగిన కల్పతరువు ఆరుద్ర'' అని వేటూరివారు ఆరుద్రకు కితాబు ఇవ్వడం గమనిస్తే ఆరుద్ర శక్తి ఏమిటో అవగతమౌతుంది.

పరిశోధన ఆరుద్రకు ఆహారం, అతని రచనలకు మణిహారంగా నిలిచే రచనగా 'ప్రపంచ జాతుల చరిత్ర'ను 7000 పుటల గ్రంధంగా ఒక్కచేతి మీదగా నడపడం ఆరుద్రగారికే సాధ్యం. 1960-70 దశకంలో'సమగ్రాంధ్రా సాహిత్యం' రచించి విశ్వవిఖ్యాతుడయ్యాడు.

''పాట పక్షిలా ఉండాలి'' అనే ఆరుద్ర. అతని పాట 'పనస తోన రుచి, సంపెంగ పరిమళం'లా పల్లవిస్తాయి. చరణాలు 'వాణిమంజీరనాదాలు'గా పండిత పామరుల నోట అజరామరమైన తెలుగుపాట ఆరుద్ర.

1970-80 దశకంలో అన్నమయ్య గానామృతం సరిసాటిగా తన పాటమృతం తెలుగువారికి పంచిన ధీమంతుడు, శ్రీమంతుడు. ఆ పాటల పల్లకి పేరు 'శ్రీరామ గానామృతం'.

ఇక రాముడికి ఆరుద్రకు వున్న సంబంధం పరిశీలిస్తే.... ఆరుద్రగారు నాస్తికులు. ఎంత నాస్తికులంటే '' అద్దం ముందు ప్రతి రైటిస్టు, అద్దంలో లెఫ్టిస్టే'' అనే తెగువగల నాస్తికులు. అయితే,వారు సినిమాల పరంగాగాని,పరిశోధనల పరంగా గాని వ్రాసిన వాటిలో అధికభాగం  రామయణమే. రాముడ్ని, రామాయణాన్ని వారు అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది.

''తండ్రి ఆనతి తలదాల్చి

 తనయుడు దశరధరామయ్య సుగుణాత్ముడు'' అని ప్రశంసించారు ఆరుద్ర.

''ధర్మపత్ని చెరబాపగ

 దనుజుని దునుమాడెను''అంటూనే
''ధర్మము కాపాడుటకా
 సతినె విడనాడను''.

అని తెలియజేయడం వారికే చెల్లింది. అలాగే రామనామం,రామపాదం మహత్యాన్ని తెలియజేస్తూ వ్రాసినా-
''రాయినైనా కాకపోతిని
 రామపాదం సోకగా''
అన్నపాట తెలుగు సాహిత్యంలో శాశ్వత కీర్తిని సంపాదించుకుంది. ఆ పాట భావం కళ్లు చెమరింపచేస్తుంది. ఒళ్లు గగుర్‌పొడిచేలా చేస్తుంది.
అలాగే 'మేలుకో శ్రీరామ' అనే పల్లవితో వ్రాసిన పాటలో
''తరుణి సీతమ్మతల్లి గృహవిధుల మునిగినది......
 తిరిగి శయనించేవు మర్యాద కాదయ్య.''

 అన్న వాక్యాలలో రాముని గడుసుభావంతో హెచ్చరిక చేయడం ఆరుద్ర గారికే చెల్లింది.త్యాగరాజస్వామి శ్రీరాముని తన ఇంటిలోకి ఆహ్వానిస్తూ హెచ్చరికగా ''రా..... అని జాగురుకత తెలియజేసై ఏకంగా శ్రీరామునే గడుసుగా హెచ్చరిస్తారు ఆరుద్ర.

రామదాసు ''పలుకెబంగారమాయెనా...'' అనే కీర్తనను సరికొత్త భావకృతిలో ఈ విధంగా అంటారు....
''లక్షధికారి అయిన లవణమన్నమెగాని
 బంగారు కణికలు మింగలేరను''
అని ఆరుద్ర కలం సమయస్పూర్తికే చెల్లింది.
''నిలకడలేని అలకోతి మూకతో
 పెనుకడలిపై వారధి బంధించినావె''

నీ పేరు జేపియింప తీరేను కోర్కెలు నేనెంత సుతియింతు నా భాగ్యగరిమ అనె శ్రీ చరణాన్ని ప్రసాదంగా అందించారు.

అలాగే 'మంగమ్మగారి మనవడు'' చిత్రంలో-
'' శ్రీ రఘురామ సీతారామా
  రావాలయ్యా నీ రాజ్యం''
అని ధరణి రామరాజ్యంలా విలసిల్లాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని వారి  అభిలాషిoచారు.

శంకరభగవత్‌పాదుల శివ మానస పూజకు సరిజోడుగా
 '' నా దేహమే నా దేవళం
   నా జీవమే ఆరాధనం''
అని రామ మానస పూజ చేసారు ఆరుద్ర.

'శ్రీరామాoజనేయ యుద్ధం' చిత్రంలో-
''శ్రీకరమౌ శ్రీరామ నామం
  జీవామృత సారం
  పావనమీ రఘరామ నామం
  భవతారక మంత్రం''
అని ''శ్రీ కైవల్యపధంబు చేరు'' అనే పోతన భావానికి అర్థ చమత్కృతితో ఆరుద్ర శ్రీరాముని స్తుతించారు.

సాహితీ రామభక్తుడిగానూ, సినీపాట కట్టిన రామబంటుగానూ పరిశీలించినట్టయితే....
రామాయణానికి పాట ద్వారా పట్టాభిషేకం చేసిన ఆరుద్రగారు రాముని సైతం ప్రశ్నించే విధంగా వ్రాసిన ఈ పాటను పరికిస్తే...


 ''భలేవాడివి శ్రీరామ శ్రీరామ
  నీ బడాయి చాలును రఘురామ
  ప్రభావమన్నది ఉంటే నీ ప్రతిభను ఇప్పుడే చూపించు''

రామధర్మం, రామబాణం, రామ మార్గం సదా నిలపాలనే రాముని హెచ్చరిక రామునికి చేసినట్లుగా వుంటుంది ఈ పాట.

అలాగె బాపు, రమణల 'భాగవతం' ఈ.టీవీ. వారి రామయణం సీరియల్‌లో '40 నిమిషాలపాటుగా 'సుందరకాండ' రచించి ధన్యజీవులయ్యారు.

ఇలా  కేవలం సినిమా పాటల్లోనె రాముని స్తుతించాక, పరిశోధనల్లో సైతం రామాయణాన్ని కొత్త కోణంలో'' రాముడికి సీతేమౌతుంది?'' అనే గ్రంధంలో తెలియజేశారు. ఈ పుస్తకంలో ప్రపంచ దేశాల్లోని రామాయణ విశేషాలు, సీత విశేషాలు విపులంగా విశ్లేషించారు. అలాగె మొల్ల రామాయణం పై సాధికారిక పరిశోధనాత్మక వ్యాసం ప్రచురించారు.

అరుద్ర తన మాటలతో, పాటలతో, పరిశోధనతో రామనామం జపించారు, రామాయణం రక్తికట్టించారు.  ఆ భావమృతకాసారంలో తానోక బిందువై తరించారు. నిత్యం స్మరించారు.

 ''రామయ్య నడకలో వెడలెను కోదండపాణి'' అనే పల్లవితో సంపూర్ణరామాయణంలో పాటను విరచించి రామాయణానికి సంపూర్ణ సిద్ధిని ప్రసాదించారు.

రామకథ సాహిత్య పారాయణంలో ఓలలాడిన రాముడు. ఆ శ్రీరాముడు అతని సాహిత్య సుమధుర వచన గీతామృతానికి పరవశించి తన చెంతకు చేర్చుకొని అతనిని తనలో లీనం చేసుకున్నాడు.

'' తెలుగుదనం తేటదనం నిండిన ఆరుద్ర తెలగుసాహిత్యంలో జయపతాక
  అతడి రచనల పరంపర నిత్యపరాయణం తరతరాల అంతరంగాలకు....''

అతడే సాహితీ ఘనాపాటి
అతనికెవ్వరు రారు సాటి
పరిశోధనలలో మేటి
రామలక్ష్మి పెనిమిటి


                ఓ కూనలమ్మ!ఆరుద్ర సాహితీవనం నిత్యవసంత శోభతో కూనలమ్మ పదాలతో ప్రకాశితమౌతూనే ఉంటుంది. ఆ సాహితీ సుమధు విశేషాలతో  మళ్లీ కలుసుకుందాం...!


 - డా|| నోరి రాజేశ్వర రావు


tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon