• చిగురుకల కు స్వాగతం

శిఖరారోహణ

శిఖరారోహణ

 నంబూరి పరిపూర్ణ

 

ఇంటర్‌ ఫస్ట్‌ క్లాసులో పాసయి కంప్యూటర్‌ బి.ఎస్సీ. చేయాలనుకుంటున్న భార్గవికి హఠాత్తుగా చదువు మానేయమన్నాడు తండ్రి. కూతురు గ్రాడ్యూయేటయితే.పోస్టుగ్రాడ్యూయేట్‌ అల్లుడ్ని తేవాల్సివస్తుందనే భయం. తల్లి , తమ్ముడూ కూడా తండ్రి మాటనే పట్టుకునేసరికి ఆశలకు నీళ్లొదలక తప్పలేదు.

 

గోవిందరావుకు చిన్నతనంలోనే అబ్బిన తాగుడలవాటు, పెళ్లయిన తర్వాత ఇంకా ముదిరింది. పొగాకు వ్యాపారం చేస్తాడు దండిగా సంపాదిస్తాడు. కానీ, మూడొంతులు తాగుడికీ, జూదానికీ ఖర్చు చేసి మిగిలింది భార్యకిచ్చి దాన్లోనే అన్ని గడపమాంటాడు. అతని దృష్టిలో సంసారం ఖర్చులు తప్ప మిగతావన్నీ వృధా ఖర్చులే? ఇంటికి సంబంధించి ప్రతిది పొదుపుగా జరగాలి. గడ్డ కట్టే చలిలో వేడినీళ్లేవరు పోసుకోకూడదు. నడివేసవయినా ఫ్యాన్లు తిరగ్గూడదు. పిల్లలెవరైనా వేసుకుంటే చటుక్కున ఆపేస్తాడు. చుట్టాలొస్తే అనవసర ఖర్చు. వాళ్ల కోసమని ప్రత్యేకంగా కూరలు, వంటలూ చెయ్యకూడదు. ఎడముఖం పెడముఖంగా వుంటే త్వరగా వెళ్లిపోతారని తన పొదుపు చర్యలన్నిటినీ తు.చ తప్పకుండా అమలుచేస్తుంటాడు.

 

నిత్యం తాగోస్తాడు. తనే ముందుగా సుష్టుంగా భోజనం ముగిస్తాడు. తీరా భార్యా పిల్లలు ఎవరితో ఒకరితో  ఏదో ఒక గొడప లేపి సుభద్రమ్మ వీపును విమానం మోత మోగిస్తాడు. తల్లి దుఃఖాన్ని మింగుతూ, పిల్లలు ఆభోజనంగా ఎన్నో రాత్రులు వెళ్లబుచ్చారు. ఈ మధ్య తాగుడు మరీ ఎక్కువైంది. ఇంటిని బొత్తిగా పట్టించుకోవడం మానేశాడు. టెన్త్‌ చదివే కొడుకు భాస్కర్‌ ఎన్నిసార్లడిగినా తండ్రి ఫీజుకు డబ్బివకపోతే ఏకంగా స్కూలే మానేయాల్సి వచ్చింది. వ్యాపార పనుల మీద చుట్టుపట్ల వుండే ఊర్లకెళ్లివచ్చే గోవిందరావు ఈ మధ్య ఇంటికే రావడం లేదు. తనొచ్చి భత్యమిస్తేనే పొయ్యిలో పిల్లిలేచేది. రోజుల తరబడి తండ్రి  ఇంటికి రాకపోయేసరికి పిల్లలు ఆకలితో నకనకలాడసాగారు. సుభద్రమ్మేమో 'ఈ మనిషేమయినట్టు' తాగి రోడ్డు  మీద పడి యాక్సిడేంటేం చేసుకోలేదు గదా? అని దిగులుగా భర్త కోసం ఎదురు తెన్నులు చూస్తూ కూచుంటోంది.

 

రాను రానూ... పదిహేను రోజులకీ, ఇరవై రోజులకీ రావడం మొదలెట్టాడు. గోవిందరావు ఈసారి అతనొచ్చి రెండు నెలలయిపోయింది. సుభద్రమ్మకు ఏమి పాలుపోలేదు. ఏం చేసి పిల్లల కడుపుకింత తిండి పెట్టుకోవాలో తెలియడం లేదు. ఇంటిల్లిపాది పస్తులతో గడుపుతున్నారు. ఈ దుస్థితిలోంచి బయటపడేదందుకు కూతురు భార్గవి నడుంబిగించింది. తల్లి తమ్ముడూ నిస్సహాయులు. తను ఎంతో కొంత చదువుకుంది అంచేత తనే ఏదో ఒక దారి వెదకాలి. ఏ చిన్న ఉద్యోగం దొరికినా చేద్దామని గట్టిగా ప్రయత్నించింది. చివరికి ఫ్యాన్ల కంపెనీలో అకౌంటంట్‌గా చేరింది. రెండు వేలిస్తున్నారు. తల్లితోపాటు ముగ్గురూ కడుపు నిండా తింటూ నిశ్చింతగా బతుకుతున్నారు. తల్లి ముఖంలో మళ్లీ కళ వచ్చింది. తమ్ముడు మళ్లీ స్కూలుకెళుతున్నాడు సుభద్రమ్మకు భార్గవి సాక్షాత్తూ అన్నపూర్ణగా కనిపిస్తే, భాస్కర్‌కు తన అక్క సరస్వతీ స్వరూపంగా తోస్తోంది. గోవిందరావు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో ఏ మాత్రం తెలియడం లేదు.

 

రరరరర

 

గోవిందరావు తిరిగి ఇంటికొచ్చేసరికి పూర్తిగా సంవత్సరం గడిచింది. రావడంతోనే తనింత కాలం ఎక్కడుందీ అడగ్గూడదని శాసించాడు. మురిక్కపు గొడ్తున్న బట్టలు తీయించి. ఒంటికి చమురు బాగా పట్టించి తలంటించింది సుభద్రమ్మ బొత్తిగా ఎముకల పొగై వచ్చాడు ఎంతో జాలి కలిగిందామెకు. రోజూ లివరూ తదితర పుష్టినిచ్చే ఆహారం పెట్టి నెలకల్లా ఏనుగల్లే తయారు చేసింది.

 

నెమ్మదిగా ఇంటి స్థితిగతుల్నంచనా వేయడం మొదలెట్టాడు గోవిందరావు. ఇన్నాళ్లు తను లేకపోయినా వీళ్లేమీ ఇబ్బందులు పడినట్టుగా లేదు. వస్తు సంభోగాల్తో ఇప్పుడుఇల్లు నిండుగా వుంది. మరి భార్గవి ఉద్యోగం చేసి సంపాదిస్తోంది గదా ఈ జరుగుబాటుకీ తనే కారణం. తన భార్యకీ ఇప్పుడు కూతురు అండ బాగా దొరికింది. తన మాటకింకేం లెక్కచేస్తుంది? ఇదివరకులా భయపడదూ ఇక అడుగులకు మడుగులొత్తుతుందా?

 

తన అనుమానం తీర్చుకోవలని..ఒక రోజున బాగా తాగి నిషా ఎక్కించుకొన్నాడు. వచ్చీ రావడంతోనే 'ఏయ్‌' మంచినీళ్లు పట్రా!''అంటూ భార్యను కేకేశాడు. ఆమె తెచ్చి గ్లాసందిస్తుండగానే ''ఏమిటింతాలస్యం?'' నీళ్లడగ్గానే అందించకుండా అక్కడ చేస్తున్న పెత్తనాలేమిటి?' అని గ్లాసు విసిరికొట్టి సుభద్రమ్మను డబడబా బాధడం మొదలెట్టాడు.

 

అప్పుడే వచ్చిన భార్గవి ' ఏంటి నాన్నా ! ఎందుకలా కొడ్తున్నావ్‌ అమ్మను ?'' అని గట్టిగా గదిమింది.

 

'' అమ్మాయ్‌ ! నువ్వడ్డు రాకు. దీనికీ  మద్య నా మాటంటే బొత్తిగా లెక్కలేకుండా పోయింది. జలుబొదిలించేస్తా ఇవ్వాళ' మా అమ్మింత కాలం నీ వల్ల తిన్న దెబ్బలు చాల్లే. ఇకనించి పడనిచ్చేది లేదు. మళ్లీ చెయ్యత్తారంటే ఊరుకోను' అని వార్నింగిచ్చి అమ్మనింట్లోకి తీసుకెళ్లింది  భార్గవి. కూతురి వంక మింగేసేలా చూస్తూ బయటకెళ్లిపోయాడు గోవిందరావు.

 

మర్నాటీ నుంచీ భార్గవికీ, తండ్రి సాధిపులు వేధింపులు మొదలయ్యాయి. 'అమ్మాయ్‌ ! నా కూతురు బయటకెళ్లి ఉద్యోగం చేస్తుందంటే నాకది చాలా చిన్నతనం. ఆడపిల్ల అర్జన మీద బతికే అవసరం లేదు  మాకేవరికీ. నువ్వు రేపట్నించీ ఉద్యోగానికెళ్లద్దు అజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పాడు గోవిందరావు.

 

దానిమీద  తండ్రికూతళ్లకీ వాదన రోజూ వాదన జరుగుతోంది. ఇంట్లోంచి ఎప్పుడు వెళ్లేదీ, తిరిగిప్పుడొచ్చేదితెలియని, నిలకడలేని తండ్రి ఒత్తిడికిలొంగదలుచుకోలేదు భార్గవి. తనందర్నీ ఆదుకుంటున్న బంగారంలాంటి ఉద్యోగాన్ని అసలే వదలదలుచుకోలేదు.

 

నెల గడిచిందో లేదె చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు గోవిందరావు. తరువాత మూడ్నెలకో, అర్నెళ్లకో వస్తూ ఒక నెలపాటు భార్యతో సేవలు చేయించుకోవడం, ఆమె ఇంటి ఖర్చుకని దాచిపెట్టుకొన్న డబ్బులు పట్టుకుపోవడం మాములయిపోయింది. అతని మీద ఎవరికీ భరోసా వుండటం లేదు. ఇంటికి రాకపోవడమే మేలనుకుంటున్నారు. బాగా ఆలోచించి సుభద్రమ్మ భ్యాంక్‌ లోన్‌ తీసుకుంది. నాలుగేదెల్ని కొని కేంద్రానికి పాలుబోస్తూ నెలకి వెయ్యిన్నారవరకు సంపాదిస్తోందని తెలుసుకొన్న గోవిందరావు వెంటనే ఇంటికి వచ్చాడు. భార్య మీద ఎప్పుడూ చూపించనంత ప్రేమ కురిపించాడు. వ్యాపారమ్మీద పెడితే మంచి లాభాలొస్తాయాని నచ్చజెప్పి సుభద్రమ్మ పోగేసిన డబ్బంతా పట్టుకుపోయాడు. అయితే ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు తరచుగా వస్తున్నాడు. వ్యాపారం పేరు చెప్పి డబ్బు తీసుకుపోతూనే ఉన్నాడు.

 

ఒకసారిలా వచ్చి డబ్బివమంటూ పట్టుకున్నప్పుడు ఇక నుంచి తన దగ్గర చిల్లిగవ్వ దొరకదు. డబ్బు కోసమే అయితే రానవసరం లేదని సుభద్రమ్మ ఖచ్చితంగా చెప్పింది. దాంతో ఉగ్రుడైపోయి తలుపులేసి కొట్టడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగక చేతులతో మెడను బిగించాడు. కిటికీలోంచి ఆ దృశ్యం అప్పుడే వస్తున్న భార్గవి కంటబడటంతో వెంటనే ఇరుగుపొరుగు వాళ్లను కేకేసి, తలుపులు బయటనుంచి 'నువ్వసలు మనిషివేనా?' మాటిమాటికీ వచ్చి ఎందుకు పీడిస్తున్నావు మమ్మల్ని? ఆడాళ్ళ అర్జన పనికి రాదన నువ్వు మరిప్పడు మా కష్టార్జితాన్నెందుకు తన్నుకుపోతున్నావు? మరిక్కడ్నించి కదులు ! లేదా పోలిసుల్ని పిలవాల్సి వస్తుంది'' అంది కోపంతో.

 

పళ్ళు పటపటకోరుకుతూ కూతురి వైపు చూసి ' ఎంత పొగరే నీకు ! ఉద్యోం చేసి ఉద్దరిస్తున్నావనే ఈ పొగరంతా? అదెన్నాళ్ళంటుందో చూస్తాను. మూడ్రోజుల్లో ఊస్ట్‌ చేయించకపోతే నా పేరు గోవిందరావే కాదంటూ' పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ వెళ్లిపోయాడు.

 

ఆ మార్నాడే భార్గవి పనిజేసే కంపేనీ ఎం.డీని కలిసి 'సార్‌! మా భార్గవి ఎంత జెప్పినా పెళ్లికొప్పుకోవడం లేదు. చేసుకునేవాడు ఉద్యోగం మాన్పించేస్తాడని భయం. సంబంధాలన్నీ పోతున్నాయి. మీరే సాయపడాలి. ఏదో ఒక కారణం చెప్పి దాన్ని పనిలోనుంచి తీసెయ్యండి. 'అప్పుడిక పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుంది. కాస్త పుణ్యం కట్టుకొండి అని బ్రతిమాలాడు. ఎం.డి. తలూపాడు గానీ భార్గవి లాంటి మంచి వర్కర్ని వదులుకోవడం ఇష్టంలేదతనికి.

 

అయితే మర్నాటకాల్లా బుర్రలో ఏం తోచిందో దేశమ్మిది కెళ్లిపోయాడు గోవిందరావు. మళ్లీ ఇంటి ముఖం చూడలేదు.

 

                                                @@@

 

పిల్లచేపకు ఈతొచ్చినంత సహజంగా భాస్కర్‌కు కూడా తండ్రి లక్షణాలన్నీ అబ్బినాయి. అక్క ఉద్యోగం చేయడం, ధీమాగా బతకడం అతనికేందుకో రుచించడం లేదు. తన చదువు ఆమె సహాయంతో పూర్తయిన మాట నిజమే ! కానీ, తనిప్పుడు ఐ.టి.ఐ  ఎలక్ట్రానిక్‌ ట్రేడ్‌ చదివి డిప్లామో సంపాదించాడు. గవర్నమెంటుద్యోగం వచ్చే లోపుగా ఓ ప్రైవేటు కంపెనీలో నెలకు పదిహేనొందల జీతంతో పనిచేస్తున్నాడు. పాడి మీద అమ్మకీ కూడా బాగానే వస్తోంది.  మరిక అక్కకి ఉద్యోగమెందుకు చేయడం? పెళ్లి చేసుకొని అత్తరింటికెళ్తే ... తనకీ, కుటుంబానికీ ఎంతో గౌరవంగా వుంటుంది.

 

కూతురి పెళ్లి చింత సుభద్రమ్మకి బాగా పట్టుకొంది. ఎన్ని సంబంధాలొచ్చినా ఒప్పుకోవడం లేదు. ఉన్నకొద్దీ వయసు ముదిరిపోతుంది. చెప్పిన కొద్ది మొండికేస్తుంది భార్గవి.

 

భార్గవికేమో పెళ్లి పార్టీలు సాగించే బేరసారాలకు ఒళ్లు మండిపోతుంది. కొంచెం హోదా వున్న  వరునికి కనీసం ఐదు లక్షలు కట్నం కావలంట. గుమస్తా, బస్సు కండాక్టర్‌ కేడర్‌కు రెండు అక్షలు పోనీ, తక్కువ రేటుకు ఒప్పుకోబోతే పెళ్ళయ్యాక ఉద్యోగం మానేయాలట. ఏం ఎందుకు మానాలి? ఎందుకంత భయం ఉద్యోగం చేసే భార్యంటే?

 

ఒకసారి భార్గవి ముందే ఆమె పెళ్లి గురించి తల్లితో మాట్లాడుతూ... ''అమ్మా !  దీన్నసలు చదివించి తప్పు చేశావు. పైగా ఉద్యోగం కూడా చేయనిచ్చావు. అది వుందనే ధీమాతోనే గదా పెళ్లి చేసుకోవడం లేదు. ఇకనైనా ఉద్యోగాన్ని మాన్పించు. అప్పటి వరకు అది పెళ్లి చేసుకోదు. ఇప్పటికే ఫ్రేండ్స్‌ అందరూ అడుగుతున్నారు 'పెళ్లేందుకవలేదని? అన్నాడు భాస్కర్‌...వంశ గౌరవం నిలిపే బాధ్యత తనదేనని సూచిస్తూ.

 

'' ఓరేయ్‌ మనల్ని విడిచి నాన్న వెళ్లిపోతున్నా... ఈ ఉద్యోగముంది కాబట్టే ఎవరినీ చెయ్యి చాచకుండా బతికాం. నీ చదువు పూర్తయ్యేందుకూ ఇదే ఆధారమైందనేది గుర్తుంచుకో కొంచెం అంది భార్గవి.

 

ఆ మాటకు తల్లి కల్పించుకుంటూ ''ఓయబ్బో ! మా అవసరాలన్నీ నువ్వే గడిపినట్టు మాట్లాడుతున్నావే? మరీ నేను పాడి మీద సంపాదించినదంతా ఏమవుతున్నట్టు? నువ్వెన్నయినా చెప్పమ్మాయ్‌ ! ఇప్పుడిక నీకు పెళ్లి ముఖ్యంగానీ ఉద్యోగం కాదు.కట్టుకున్నవాడు వద్దంటే ఉద్యోగం మానేయాలి ఉద్యోగం లేకపోతే ఎట్లా అవుతాయి పెళ్లిళ్లూ?'' అంది కూతురి మాటను తీసిపారేస్తూ. ఆ మాటలకు తెల్లపోయి తల్లి ముఖంలోకి చూస్తూండిపోయింది భార్గవి.

 

భార్గవి ఆఫీసుకెళ్లేందుకు సిటీ బస్సుక్కుతుండగా భాస్కర్‌ ఫ్రెండొకడు హఠాత్తుగా 'భై' చెప్పి చెయ్యూపడం చూసి నవ్వుకుంది. కానీ రోజూ అదే టైంకు చెయ్యి ఊపడం మొదలెట్టాడు. చిరాకుపడి ఒకటి రెండూసార్లు వార్నింగిచ్చింది. కానీ అతను మానడం లేదు. పైగా వెకిలి నవ్వులు కూడా జత చేశాడు. ఇక తప్పనిసరై పోలీసు కంప్లయింట్‌చ్చింది.ఆ ఏరియా సబ్‌

 

సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ అతన్నిస్టేషన్‌కు పిలిపించి గట్టిగా పాఠం చెప్పాడు. అప్పట్నించి వాడింకా కక్షగట్టి చెడు కథలు కల్పించి భాస్కర్‌కు ఎక్కించసాగాడు.

 

భాస్కర్‌ గబగబా ఇంటికొచ్చి మండిపడుతూ 'ఉద్యోగ మానమని ఎంతజెప్పినా నువ్వెందుకు మానడం లేదో ఇప్పుర్థమైంది. ఉద్యోగముంటే మీ కొలీగ్‌తో కలిసి సినిమాలకీ, షికార్లకూ వెళ్ళడమేనా? రేపట్నించి బయటకెళ్ళావంటే ఇంట్లోంచి గెంటేస్తాను అన్నాడు.

 

భార్గవి అవమానంతో ఊగిపోయింది'నువ్వెరివిరా - నన్ను ఉద్యోగం మానమనీ, బయటిక్కదలొద్దనీ చెప్పడానికీ? పోకిరీ వెధవల మాటలే నిజమానీకు? తమ్ముడు పైకి రావాలని కష్టపడి పనిజేసి ఆదుకున్నాను. లేకపోతే ఏ హోటల్లోనో కప్పులు కడుగుతుండే వాడివీపాటికి'' అంది ఈసడింపుగా.

 

'' ఏం కూశావే మళ్ళీ అను ఆ మాట' అంటూ చెయ్యెత్తి మీదకొస్తున్న కొడుక్కు అడ్డం పడి వెనక్కి నెట్టుకెళ్లింది సుభద్రమ్మ.

 

భాస్కర్‌ ఆ రోజుకు చల్లబడినా, ఏదో ఒక సందర్భం చూసుకుని అక్కతో తగాదాకు దిగుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు చేయి కూడా చేసుకుంటున్నాడు. ఇక అక్కడుండటం మంచిది కాదనుకొంది భార్గవి. తల్లి ఇంట్లో లేని సమయం చూసి తన బట్టలు సర్థుకుని బయటకొచ్చేసింది.

@@@

 

వర్కింగ్‌ ఉమెన్స్‌ హస్టల్లో చేరింది. మూడేళ్ళ నుంచి అక్కడే వుంటోంది. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే 'దూర విద్య' ద్వారా ఉన్నత విద్యను, ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించింది. ఆర్‌.డి.ఓ గా జాయినవ్వడానికి బయల్దేరుతూ ఆ ముందు రాత్రి తల్లికి ఉత్తరం రాసింది.

 

నా ప్రియమైన అమ్మా!

 

నువ్వు క్షేమంగా వున్నావనీ, తమ్ముడు నిన్ను భద్రంగా చూసుకుంటున్నాడనీ తలుస్తున్నాను. తమ్ముడి వైఖరి భరించలేక నేను ఇంటినుంచి వచ్చేసినా నా జ్ఞాపకాల నిండా నువ్వే వున్నావు.

 

అమ్మా అలా వచ్చినందుకు నాకెంతగానో మేలు జరిగిందమ్మా ! మొదటిది 'దూరవిద్య' ద్వారా ఏం.ఎ పూర్తి చేశాను. ఆర్‌.డి.ఓ గా ఎంపికయ్యాను. శ్రీకాకుళం జిల్లాఓ ఉద్యోగంలో చేరబోతున్న నాకు నీ నిండు ఆశీర్వాచనాలు కావాలి.

 

ఇప్పుడు నాకు మంచి చదువు, హోదా, సంపాదన అన్ని ఉన్నాయి. ఇన్న అర్హతలున్నా నేను భర్తను కొనుక్కోవలసిందేనా? నా అర్హతల్నీ, వ్యక్తిత్వానీ ఇష్టపడి. నా జీవితభాగస్వామి అవ్వాలని కోరే వ్యక్తి ఎదురయినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను.  పెళ్లి కన్న పిల్లలు ఎక్కువ ఇష్టం నాకు. అయితే మాతృత్వం కోసమని పిల్లల్ని కని, రేపేదన్నా అయి అతను వెళ్లిపోతే ... వాళ్లని పట్టుకొని ఏడుస్తూ నీలా కూర్చోను. అన్నీ అనుకూలించినప్పుడు సంసార జీవితంలోకి జాగ్రత్తగా అడుగుపెడతాను. తమ్ముడి పెళ్ళయ్యాక నువ్వు నా దగ్గరకొచ్చి ఎప్పటికీ నా దగ్గరే వుంటావని ఆశిస్తూ, విశ్వసిస్తూ.

 

నీ భార్గవి.

 

 

 

 

 

 

 


tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon