• చిగురుకల కు స్వాగతం

బహుమతి

                                            బహుమతి       

 

శిరంశెట్టి కాంతారావు 

 

'చూడు భావనా! నువ్విక్కడికొచ్చి అప్పుడే మూడు మాసాలవుతుంది. ఇంకా పిల్లల్లో కలువకుండా ఇలా వంటరిగానూ, ముభావంగానూ వుంటూ, ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు? నువ్వు మరీ చిన్నపిల్లవేం కావు. పరిస్థితిని అర్ధంచేసుకుని మసలుకోవాలి. అసలే నువ్విప్పుడు చదువుతుంది పదవతరగతి. చదువు మీద దృష్టి పెట్టకపోతే పబ్లిక్‌ పరీక్షలు ఎలా వ్రాస్తావ్‌? పదవతరగతి చదువుతున్న పిల్లవు నువ్వే ఇలా వుంటే. నీకంటే చిన్నవాడు అక్కడ సూర్యాపేటలో మీతమ్ముడెలా వుంటున్నాడో ఒక్కసారి ఆలోచించు'' భువనగిరి కాపువాడలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ బాలికాసదనం అధికారిణి హెబిషిబా మేడం రాత్రి ఏడుగంటల స్టడీఅవర్‌లో పిల్లలందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకొని చదివిస్తున్న సమయంలో పుస్తకం ముందేసుకుని గాల్లోకి చూస్తూ మౌనంగా వున్న భావనను వుద్దేశిస్తూ అనునయంగా హెచ్చరించింది. 
మేడం పరామర్శతో కదిలిపోయిన భావన ఒక్కసారిగా బావురుమంటూ ఏడ్చింది. 
దాంతో, చదువుకుంటున్న పిల్లలంతా పుస్తకాలు పక్కనబెట్టి వచ్చి భావనను చుట్టుముట్టారు 
''భావనా! ఏడవకు.మేం గూడా మొదట్లో నీలెక్క ఏడ్చినోళ్ళమే. కానీ తప్పదుగదా! ఏదోవిధంగా అలవాటుపడాల'' అంటూ పదవతరగతి చదువుతున్న భవానీ వాళ్ళు భావనను సముదాయించసాగారు. 
''నువ్వేడవకక్కా! నువ్వేడిస్తే మాక్కూడా ఏడ్పొస్తుంది'' మూడవతరగతి చదువుతున్న గాయత్రి భావన గడ్డం పట్టుకుని తనూ ఏడవసాగింది. 
''దేవుడు మనకు అన్యాయం జేసిండక్కా! అందుకే మనకు అమ్మా నాయినలు లేకుండా బోయిండ్రు'' తన కళ్ళల్లో నుండి కూడా అప్రయత్నంగా వస్తున్న కన్నీళ్ళను పట్టించుకోకుండా భావన కన్నీళ్ళను తూడ్చే ప్రయత్నం చెయ్యసాగింది ఎనిదవ తరగతి చదువుతున్న మమత. 
''అమ్మానాయినలను మర్చిపొయ్యి మనమంతా బాగా చదువుకోవాలక్కా!'' జీవితంలో స్థిరపడాలంటే తమకు చదువెంత ముఖ్యమో చెప్పుకొచ్చింది తొమ్మిదో తరగతి చదువుతున్న పారిజాత. 
నిన్నమొన్నటి దాకా ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి అర్ధంతంరంగా అమ్మానాన్నలను కోల్పోయిన ఆ చిన్నారులంతా ఎంతో పెద్దమసుతో తమ తోటి అనాధ పట్ల చూపిస్తున్న సానుభూతికి హెబిషిబా మేడంతో పాటు పక్కనేవున్న వార్డెన్‌ శశిరేఖ మేడం.వంటమనిషి పార్వతమ్మ, నైట్‌ వాచ్‌ఉమెన్‌ నాగలక్ష్మి వాళ్ళంతా ఉద్వేగంతో కదిలిపోయారు. 
కొంతసేపటిదాకా పిల్లల్ని అలావదిలేసిన హెబిషిబా మేడం ''చూడు భావనా! నిన్ను చూసి వీళ్ళంతా ఏడుస్తున్నారు. అందుకే నువ్వింకా ఏడవడం బాగోదు ఊరుకో ఊరుకో'' అంటూ బుజ్జగించింది. 
ఆతరువాత కొంతసేపటికి మెల్లగా దు:ఖం నుండి తేరుకున్న భావన ''ఎల్లుండి నాపుట్టిన రోజు, మా అమ్మానాయనలు చనిపోయినరోజు కూడా. అది గుర్తుకొచ్చి ఏడుపొస్తుంది మేడమ్‌'' అంటూ తన దు:ఖ కారణాన్ని వివరించింది. 
''అంటే! నీ పుట్టిన రోజున్నే మీ అమ్మా నాన్నలిద్దరూ చనిపోయారా! అదెలా?'' భావన వంక మరింత సానుభూతిగా చూస్తూ అడిగింది వార్డెన్‌ శశిరేఖ. 
వార్డెన్‌ మాటలను విన్న భావన నాలుగునెలల కింద జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పసాగింది. 
@@@@ 
వెంకటేశ్వరావు, జ్యోతి దంపతులది నల్లగొండ జిల్లా ఫణిగిరి గ్రామం. ఐదుగురు అన్నదమ్ముల్లో అతను నాలుగోవాడు. 

వరుసగా నాలుగేండ్లపాటు ఐదెకరాల్లో పత్తి, రెండెకరాల్లో మిర్చి వేసిన వెంకటేశ్వరావుకు పెట్టుబల్లు కూడా రాకపోగా బోరు ఎండిపోవడం, అన్నదమ్ములకు కౌలు డబ్బులు కూడా ఇవ్వాల్సి రావడంతో అప్పుల మీద అప్పులు చేయవలసి వచ్చింది. దాంతో అప్పులు తీరే దారి కనబడక ఒకరోజు రాత్రి పురుగుమందు తాగి పత్తిచేలోనే ప్రాణాలు వదిలాడు.ఆవార్త వినడంతోనే జ్యోతి ఒక్కసారిగా కుప్పగూలిపోయి అలాగే ప్రాణాలు వదిలింది. 
దాంతో ఐదవ తరగతి చదువుతున్న అనిల్‌, పదవతరగతి చదువుతున్న భావన హఠాత్తుగా తల్లీదండ్రులు లేని అనాధలయ్యారు. 
వెంకటేశ్వరావు అన్నదమ్ములు నలుగురూ అతనివాటా రెండెకరాలు అమ్మి అప్పులు కట్టేశారు. అనిల్‌ని సూర్యాపేటలో, భావనను భువనిగిరి హాస్టల్లలో పడేసి చేతులు దులిపేసుకున్నారు. 
@@@@ 
జరిగిన విషయాన్ని వివరించిన భావన మళ్ళీ ఏడవసాగింది. 
ఆ సదనంలో వున్న నలబైమంది అమ్మాయిలది నలబైరకాల గాధ. అవన్నీ ఒక్కసారిగా గుర్తుకు రావడంతో వసతిగృహం సిబ్బందికి గుండెలు వడిపెట్టినట్టుగా అనిపించి వాళ్ళుకూడా కొంతసేపు మౌనంగా వుండిపోయారు. 
అందరికన్నా ముందుగా తేరుకున్న హెబిషిబా మేడం ''సర్లే ఈ రోజుకు చదివింది చాలుగాని అందరూ లేచి అన్నాలు తినండి'' అంటూ విషయాన్ని తేలికపర్చుతూ మాట్లాడింది. 
పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకొచ్చినట్టుంది. అందుకే వాళ్ళంతా లేచి నిశ్శబ్దంగా భోజనాల కు కూర్చున్నారు. 
పిల్లలంతా తిన్న తరువాత వాళ్ళను వాచ్‌ఉమెన్‌ నాగలక్ష్మికి అప్పగించి ఇండ్లకు బయలుదేరారు హెబిషీబా మేడంవాళ్ళు. 
@@@ @
ఆరోజు భావన పుట్టినరోజు. 
రోజూ ఐదున్నరుకు నిద్రలేచే పిల్లలందరూ ఆరోజు ఐదుగంటలకే లేచి భావన మంచం దగ్గరకెళ్ళి ''హ్యాపీ బర్త్‌డే టూ యూ భావనా!'' చిలుకల మాదిరిగా అంటూ మేలుకొలుపు పాడారు. 
వాళ్ళ మాటలతో తుళ్ళిపడుతూ లేచికూర్చున్న భావన ఒక్కసారిగా కళ్ళు విప్పారుస్తూ ''థాంక్యూ, థాంక్యూ'' అంటూ ఆనందంతో ఒక్కొక్కరినీ ఆత్మీయంగా కౌగిలించుకుంది. 
ఆతరువాత పిల్లలంతా కాలకృత్యాలు తీర్చుకుని, స్నానాలు చేసేటప్పటికి రోజుకన్నా ముందుగానే వసతిగృహాని కొచ్చిన హెబిషీబా మేడం వస్తూ... వస్తూనే ''విష్‌ యూ హ్యాపీ బర్త్‌డే భావనా!''అంటూ దగ్గరికి తీసుకుంది. 
భావన వెంటనే వంగి ఆవిడకాళ్ళకు దండం పెట్టింది. 
''బుద్దిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకొని నీలాంటి అనాధపిల్లలకు సాయంచేస్తూ మంచి పేరు సంపాదించుకో'' అంటూ ఆశీర్వదించిన మేడం నిన్న రాత్రి తాను కొన్న కొత్తడ్రస్‌ను భావనకు అందించింది. 
అప్పుడే వచ్చిన వార్డెన్‌ శశిరేఖ మేడం ''ఇవి పిల్లలందరికీ పంచు'' అంటూ తాను కొనుకొచ్చిన చాక్‌లెట్స్‌ ప్యాకెట్‌ను భావన చేతికిచ్చింది. 
ఆరోజు టిఫిన్‌ కింద పిల్లలందరికీ పాయసం వండిపెట్టింది కుక్‌ పార్వతమ్మ. 
ఆరోజంతా భావనకు వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తుకు రాకుండా వుండేలా జాగ్రత్తపడుతూ పిల్లలంతా తన చుట్టూనే తిరుగసాగారు. 
సాయంత్రం ఆరుగంటలవుతుందనగా పిల్లలంతా చేరి వసతిగృహం ముందు ఖాళీస్థలంలో జంబుఖానాలు పరిచి, వాటి మీద ఆఫీస్‌రూమ్‌లోని టేబుల్‌, కుర్చీలను తెచ్చి వేశారు. 
వాళ్ళ హడావిడిని గమనించిన హెబిషిబా మేడం, వార్డెన్‌ మేడం శశిరేఖ, వంటమనిషి పార్వతమ్మ, వాచ్‌వుమెన్‌ నాగలక్ష్మి వాళ్ళంతా విస్మయ పడిపోతూ ''ఏంటిదంతా!?'' అంటూ ప్రశ్నించారు. 
''ఒక్క పదినిమిషాలాగండి మేడం! మీకే తెలుస్తుంది'' అంటూ అన్నీ సర్దడం పూర్తిచేసిన పిల్లలు హెబిషీబా మేడంను టేబుల్‌ ముందున్న కుర్చీమీద కూర్చోబెట్టి మిగతా సిబ్బందికి ఓపక్కన వరుసగా కుర్చీలు వేసి కూర్చోబెట్టిన తరువాత వాళ్ళంతా జంబుఖానాల మీద వరుసలుదీరి కూర్చున్నారు. 
ఇంతకూ వాళ్ళేం జేయబోతున్నారో అర్ధంగాని మేడంవాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు. 
''ఇప్పుడే వస్తాం మేడం'' అంటూ పదవతరగతి పిల్లలు గబగబా వసతిగృహం మేడమీదికి పరుగెత్తుకెళ్ళారు.ఎప్పుడు తెచ్చిపెట్టుకున్నారో ఏమోగాని రెండే రెండు నిమిషాల్లో పెద్ద కేక్‌ బాక్స్‌ ఒకటి పట్టుకుని వచ్చి టేబుల్‌ మీద పెట్టారు. 
వాళ్ళ ఏర్పాటును చూసిన మేడంవాళ్ళతోపాటు భావన కూడా ఆశ్చర్యపోయింది. 
''ఎక్కడ కొనుకొచ్చారు? మీకు డబ్బులెక్కడివి?'' అంటూ ప్రశ్నించింది హెబిషిబా మేడం. 
''మా చుట్టాలవాళ్ళు అప్పుడప్పుడిచ్చిన పైసల్లోనుండి దాసుకున్న పైసలు పెట్టి కొన్నాం మేడం!'' అంటూ పిల్లలంతా వివరించారు. 
టేబుల్‌ ముందుకొచ్చి నిల్చున్న మానస హెబిషిబా మేడం చేతికి చాకిచ్చి ''కేక్‌ కట్‌ చేయమని భావనను పిలవండి మేడం'' అంటూ చెప్పింది. 
''రామ్మా భావనా!'' అంటూ పిలిచిన మేడం టేబుల్‌ దగ్గరికొచ్చిన భావనకు చాకునందించింది. 
అమ్మా నాన్న వున్నప్పుడు కూడా జరుగనంత ఘనంగా తన భర్త్‌డేను జరుపుతున్న తన మిత్రుల వంక ఆరాధనగా చూస్తూ కన్రెప్పలను తోసుకొస్తున్న కన్నీళ్ళకు అడ్డుకట్ట వేయలేకపోయిన భావన ఆనందంతోనూ, సిగ్గుతోనూ ముడుచుకుపోతూ కేక్‌ కట్‌ చేసి మొదటి ముక్కను హెబిషీబా మేడం నోటికి అందించింది. 
''హ్యాపీ బర్త్‌డే టూ యూ'' అంటూ టేబుల్‌ దగ్గరకొచ్చిన పిల్లలంతా భావనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన చేతుల మీదుగా కేక్‌ అందుకున్నారు. 
కేక్‌ తిన్న తరువాత అంతా చేరి పాటలు పాడారు. డ్యాన్స్‌లు వేశారు. 
ఎనిమిదిన్నర తరువాత ''ఇక చాలు ఆపండీ! భోజనాల టైమవుతుంది'' అంటూ కుర్చీలో నుండి లేవబోయిన హెబిషిబా మేడంతో ''ఒక్కనిమిషం మేడం!'' అంటూ వసతిగృహంలోకి పరుగు పెట్టిన భవాని ఏదో గిఫ్ట్‌ ప్యాక్‌ తీసుకొచ్చి మేడం చేతికిచ్చి ''భావనా కివ్వండి మేడం!'' అంది. 
ప్యాకెట్‌ను భావనా కిచ్చిన మేడం''అందులో ఏముందో తీసి మా అందరికీ చూపించు'' అంది. 
ప్యాకెట్‌ను విప్పిన భావన అందులో వున్న ప్రతిమను బైటికితీసి అందరికీ చూపించింది. 
శాంతి కపోతంలా మెరిసిపోతున్న మదర్‌థెరిసాను చూస్తూనే పిల్లలతోపాటు మేడం వాళ్ళు కూడా తప్పట్లుకొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. 
''ముందు ముందు మీరంతా ఇదేవిధంగా కలిసి మెలిసి వుండాలని మదర్‌ అడుగు జాడల్లో నడిచి అనాధలకు, దీనులకు సేవచెయ్యాలని కోరుకుంటున్నాను. అదే మీరు మాకిచ్చే బహుమతి'' అంటూ మనస్పూర్తిగా పిల్లలందరినీ ఆశీర్వదించిన హెబిషిబా మేడం అంతటితో ఆనాటి సభను ముగించారు.  


tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon