• చిగురుకల కు స్వాగతం

వర్షం పడ్డ రోజు

వర్షం పడ్డ రోజు 

నాకెందుకో బాగుంది. కోనసీమలో గోదారి దగ్గర కూచుని కవిత్వం రాసుకుంటే ఇలా ఉంటుందేమో!

కొబ్బరాకుల నీడ, పైరు పచ్చ పిట్టల కిల కిలలు వినిపిస్తూ గోదారి పరవళ్ళకి సంగీతాన్ని చేకూరుస్తుంటే మనసు కొన్నేళ్ళ వెనక్కి వెళ్ళిపోతుంది. కనిపించిన చిత్తు కాగితమైనా కలం తీసుకుని రెండులైన్ల కవిత రాసుకుని, చూసుకుని ఆనందించేస్తాను. 

మన ఆంధ్ర నారి
మధు కలశధారి గోదావరి

ఎన్ని జ్ణాపకాలో ఆ తీరాన ఎన్ని కలలు కన్నానో, కన్నీట ఉన్నానో !
ఎన్ని ఆలోచనల వలలు వేసి భావాల పడవల్లోకి విశ్వరహస్యంలా దాగున్న చేపల్ని పట్టానో ! మళ్ళీ ప్రేమతో నీళ్ళలోకి విడిచిపెట్టాన్నో ! అవమానాలూ, సన్మానాలూ ఎన్ని కలిస్తే జీవితం - అది అద్భుత వరం, రాజ మహేంద్రవరం!

చినుకు చినుకులో నాకే కనిపించే చెలి చెమ్మగిల్లిన కంటతడి లా, భూతలం లో బతికేస్తూ పొలాలు, బలాలు, స్థలాలు అంటూ జీవించే మనుషులకి ఉరుమిన ఆకాశం సందేశం చెపుతోందేమో విశాలంగా ఆలోచించమని. వర్షంలో నాకన్నీళ్ళూ కలిసిపోయినా నాకు ఆనందమే, ఎందుకంటే ఈనీళ్ళు ఎన్నో ఆశల మొలకలై బీజాక్షరాలై పూలై పూస్తాయని. 

వర్షానికి వరదలైన నీళ్ళు ఈ దారులన్నీ మూసేస్తాయి. కాల ప్రవాహం లో నిన్ను ఈరోజు చూడలేనేమో నేను నా సైకిలు వంకా, ఆ వర్షం వంకా చూస్తుంటా. నువ్వేమి చేస్తున్నావో ! నువ్వూ నాలాగే కిటికీ దగ్గర కూచుని వర్షం చూస్తూ ఉన్నావా? నాగురించే తల్చుకుంటున్నావేమో అని ఎక్కడో ఆశ. 

నీ వేళ్ళెంతా బాగుంటాయో. వీణ నేర్చుకో వచ్చుగా అనుకున్నా, కాని అనిపించింది ఆ చేతిలోనే సంగీతముంది, వేళ్ళలోనే గాన మాధుర్యం ఉంది అని. నాకేమీ వద్దు, అలా చెయ్యి పట్టుకుని ఉండిపోగలను, అలా నడుస్తూ అనంతంలోకీ పోగలను. ఏం మాయో ఆ స్పర్శలో! నిద్రలోంచి తేరుకునీ నిద్రలోకి జారుకునే ఈ జీవి-తానికి ఈ అద్భుత అభూతకల్పనా, అతీంద్రియ వశీకరణా అవసరమా అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఆలోచన, క్రితం వారం చూసాను నువ్వు ఇన్ని గులాబీ లు ముందేసుకుని మాల అల్లుతున్నావు. నాకైతే అబ్బురంగా అనిపించింది. ఏంటి ఇంత చిన్న విషయంలో అంత గొప్ప ఏముంది అనుకుంటున్నావా? 

నీకెలా చెప్పను, ఒక గులాబి పువ్వు గులాబి మాల కడుతుంటే చూస్తే ఎలాఉంటుందో?! నువ్వే ఒక సుకుమారదరహాససౌందర్యసుమమాలవి, నువ్వు మళ్ళీ మాల కట్టడం ఏమిటి? అవి బాగున్నాయని ముచ్చటపడి ఆ మాలని కృష్ణుడికి వేయడం ఏమిటి? నీకు తెలుసా నాకనిపించింది కృష్ణుడు నాకేసి చూసి నవ్వి, 'చూశావా నేనెంత గొప్పో, నాకే వేసిందోచ్ మాల - నీకు లేదు ' అన్నట్టు అనిపించింది. శ్రీనాధుడు శివుడితో అన్నాట్ట 'గంగను విడువుము పార్వతి చాలును పరమేశా ' అలా నేనూ గోపీలోలుడితో అన్నాను, చాల్లే సరసం నీకు ఆల్రడీ లైను వేసేందుకు 18000 మందిపైన లైన్లు కట్టి ఉన్నారు, ఇక్కడ ఒక్క కను చూపుకే దిక్కులేక చస్తున్నాం కొంచెం హెల్ప్ చెయ్యొచ్చుగా అన్నాను. ఆ చిలిపి కృష్ణుడు సిగ్గుపడి ఈ రస భక్తుడిని అనుగ్రహించి నట్టున్నాడు - ఓ పువ్వు తీసి నా చేతిలో పెట్టి అన్నావు గుర్తుందా - ' ఈ పువ్వుల్లో మకరందం ఉంటుందిట - మకరందం అంటే తెలుసా మధు అన్నమాట , అంటే నువ్వే ! ' అని నవ్వేశావు. ఇప్పటికి ఆ గులాబీ పువ్వు నా మనసులో ముద్రించుకుపోయి ఉంది. 

చీకటి పడుతోంది, వర్షం తగ్గేలా లేదు. నాకైతే సైకిలేసుకుని వచ్చి నిన్ను చూసేయాలని ఉంది. ఏమి కారణం చెప్పను మాయింట్లో? ఏమి కారణం చెప్పను మీ ఇంట్లో ఇంత వర్షం లో ఎందుకొచ్చావంటే? అమ్మ ని అడిగాను కరివేపాకు, కొత్తిమీర అయిపోయాయేమో నని. కావలంటే ఆ వంకన మీ ఇంటికి రావచ్చు మీ అమ్మ ని ' ఆంటీ మా అమ్మ మీ పెరట్లో కొత్తిమీర అడిగి తెమ్మన్నారు అని '. కానీ వర్షం ఇంత వర్షంలో అమ్మ జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది వద్దు అంది. వర్షంలో వెడితే తడిస్తే జ్వరం చేస్తుందని వాళ్ళకి తెలుసు, కాని వెళ్ళకపోతే ఏం చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. వర్షం తగ్గుతోంది, గొడుగు తీసుకుని బయలుదేరతా, ఒక వేళ అదృష్టం బాగుండి నువ్వు ముందువైపు కిటికీ దగ్గరుంటే కనీసం నీ కళ్ళైనా చూడొచ్చు.  


సింధువులో బిందువులా,
మధుచంద్రిక


tags


Comments

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon