లొటపెట
డాక్టర్ ll దేవరాజు మహారాజు
అసలది గాడిద.
నిమ్మలంగ, అనుకువగ ఓండ్ర పెట్టి
బత్కులన్ని తెల్లంగ జేయిస్తనని...
అడ్డమైన ఓట్ల గుడ్డలన్ని పోలింగు సంటరు
సాకలి రేవు దాక మోస్కపోయింది.
'శాబాష్' నువ్వే మా పెబ్బవు' - అనంటది పెజ
ఇనయంగ
బయిరంగంగ
శిగ్గు లేకుండ
తను గాడిద నంటన్న - యాదిమర్శి
దండేయించుకుని
పోటువ దీయించుకుని
బాసలన్ని జేసి, సాటుంగ
అవినీతి కంపు బొదల్ల, రొచ్చుల రొంపిల
గుంటల్ల గుంటల్తోటి గంటల కొద్ది బొర్లి బొర్లి
తెల్లని శిరునవ్వుల బట్టల్తోటి బయిటి కొచ్చింది.
ఇగ అయితె, నిన్నియ్యాల...
దాని బుర్ర పెరిగింది
ఎంబడెంబడె బొర్ర పెరిగింది.
ఏ పారిటీ కద్లించకుంట కాల్లు తంబాలు, జేస్కుంది
గదే గమ్మత్తు -
ఇప్పుడది గాడిద గానే గాదు - లొటపెట!!
గాడిద లొటపెట అయితదా అని
అనుమానము ఒద్దు.
రాజకీయం మందుదింటె, ఏది ఏదన్న గావొచ్చు.
ఒప్పుడైతె లొటపెట మన్సులను
మోసంతోని, నమ్మించుకుంట
పని జూయిస్తనంట, అన్నం జూయిస్తనంట
దూప దీరుస్తనంట...
ఎడారి పనాలికల మీది నుంచి
అల్ల మంచితనాన్ని పైకి కింద్కి
ఈపు మీద ఊపుకుంట
నిదానంగ షికారు వోతాంది.
పేగులు ఓపిక తోని గిట్ట నర్కబడితే
రగతం మాడిపోతే
ఎండిన గొంతుల నుంచి కమరు అసనొత్తే.
రక్త నాలాలల్ల దూప - పారితే
దూపల - సాపు కనిపిత్తే,
దూప దీర్సు కుంటందుకు
జనం - లొటపెట పుర్రు పగలగొడ్తది.
జనవరి 1974లో ప్రచురితమైన డా||దేవరాజుమహారాజు'గుడిసెగుండె' కవితా సంకలనం నుండి.
మరోసారి పునర్ముద్రణతో ఈ నెలలో ఆవిష్కరింపబడుతున్న సందర్భంగా ఈ కవిత ప్రచురిస్తున్నాం.