నిశ్శబ్దం మాట్లాడుతుంది
మౌనంగా మానస గానంగా
మంత్రోద్దీప్త ధ్యానంగా
ప్రణవంగా
ప్రణయంగా
సర్వం పరబ్రహ్మమయంగా
యువతరానికి జయంగా
తానే స్వయంగా
నిశ్శబ్దం మాట్లాడుతుంది
నిశ్శబ్దం మాట్లాడుతుంది
ఆలోచనగా
ఆందోళనగా
ఆవేశంగా
ఆహ్లాదంగా
అందరికి ఒక్కలా
అయ్యే ఆకలిగా
నిశ్శబ్దం మాట్లాడుతుంది
నిశ్శబ్దం మాట్లాడుతుంది
అరిచినా పిలిచినా
అయ్యో అని ఏడ్చినా
ఎక్కడ శబ్దం చేస్తానోనని
స్తబ్ధమై మనో యుద్ధమై మళ్ళీ నిశ్శబ్దంగా
నిశ్శబ్దం మాట్లాడుతుంది
నిశ్శబ్దం మాట్లాడుతుంది
గం గం గంటలకు
కార్లు బస్సులు రిక్షాలు
కూర్ల వాళ్ళ కేకలు
కొనే వాళ్ళ కూకలు
కుక్కల అరుపులు
సినిమా పాటల అశ్లీలపు విరుపులు
బైకులు మైకులు
అరిచే జనసందోహానికి, ద్రోహానికి దూరంగా
వినిపించనంత దూరంగా
నిశ్శబ్దం మాట్లాడుతుంది
నిశ్శబ్దం మాట్లాడుతుంది
మనం దుప్పట్లు పరుకుచుకున్నప్పుడు
జనం చప్పట్లు చరవనప్పుడు
నిజంగా
స్వఛ్చమైన కాంతి పడ్డ ప్రిజంగా
రంగులుగా,
హ్రుదయాంతరాళాలలో ఫిరంగులుగా
నిశ్శబ్దం మాట్లాడుతుంది
నిశ్శబ్దం మాట్లాడుతుంది
నువ్వు వీణని మీటుతుంటే
అందంగా ఓ రాగం గొంతెత్తి పాడుతుంటే
నిశ్శబ్దం నిర్మలంగా వుంటుంది
జలతరంగాలలో నీ మనో లోకాలలో
సుందర వల్మీకాలలో
స్వరాల బీజాక్షరాలు వేస్తుంది
వృక్షాలను చేస్తుంది
నీ మాటల చేతల మధ్య
భావాతీతంగా, భావంగా, స్వభావంగా
దాగుడుమూతలాడుతుందీ నిశ్శబ్దం
అత్యంత అద్భుతమైనదీ నిశ్శబ్దం
వింటే ఎన్ని కబుర్లైనా చెపుతుంది
ప్రాణంతో
సత్యప్రమాణంతో
చైతన్యంతో జీవించే
మొక్కల్లో, చెట్లలోంచి
తొటల్లోంచి, పూబాటల్లోంచి
జీవచైతన్య ఘోషగా, శ్వాసగా
మంద్రంగా, అనంత విశ్వరహస్య సంద్రంగా
నిశ్శబ్దం మాట్లాడుతుంది
నిశ్శబ్దం మాట్లాడుతుంది
అది వింటే మనిషి ఋషి కాగలడు
అది కన్న మనిషి ద్రష్టవుతాడు
సకలేంద్రియచిత్తాన్ని జయించిన ద్రుష్టవుతాడు
అణువులో బ్రహ్మాణువులో
అంతర్గతంగా అణుశక్తిగా
చలించే
భయంకరోత్పాత నిశ్శబ్దం
సాగరగర్భంలో దాగుండి
చప్పునలేచి వూళ్ళన్నీ వూడ్చేసే ఉప్పెన నిశ్శబ్దం
అగ్ని పర్వత గర్భాన
నిద్రించే
ఘోటక విస్ఫోటక లావా నిశ్శబ్దం
అంతెందుకు నీ ఒంట్లో నివసిస్తూ
నీ ఆకలిని శాసిస్తూ
జీవనాన్ని ఆశిస్తుండే
ఆ జఠరాగ్ని నిశ్శబ్దం
అతీతంగా అమాంతంగా
అంతంగా ప్రతివారి సొంతంగా
ఆక్రమించే ఆ మృత్యువు నిశ్శబ్దం
కాలగమనం నిశ్శబ్దం
భూమి చలనం నిశ్శబ్దం
హృద్ స్పందన స్తబ్దమైనా
మనో గీతం నిశ్శబ్దం
దేవుడికి నిజమైన గీతంజలి నిశ్శబ్దం
యోగంలో మౌన పతంజలి నిశ్శబ్దం
అబద్దం కన్నా మంచిది నిశ్శబ్దం
వేయి అర్ధాల సముదాయం నిశ్శబ్దం
చెపితే నువ్వొక్క మాటే చెప్పగలవు
మౌనంగా శతసహస్ర శరంపరలు పంపగలవు
సూటిగా దింపగలవు
సర్వాతీతంగా ..
శబ్దాతీతంగా ..
దూరశ్రవణ తంత్రాలు, దృగ్ యంత్రాలు
పెద్ద మైకుల్లో మంత్రాలకు అతీతంగా
నిస్తంత్రంగా స్వతంత్రంగా నువ్వు నిశ్శబ్దంగా
మనో సంకేతాలను పంపగలవు
మానవాళినంతటిని ఒక్కసారి చూడగలవు
అతినీలలోహిత పరారుణ ధ్వనులను వినగలవు
మనసు ఇంద్రధనసులను కనగలవు
ఇంతకీ నువ్వనుకునే నిశ్శబ్దం
గబ్బిలాలు ఆడుకునే శబ్దం
అతీంద్రియ ధ్వనులు
ఆలోచనలు అదికదా అసలు నిశ్శబ్దం
కేక, మాట, పాట, పలుకు
ఫోను, సెల్ఫోను, సీడీ, వీసీడీ, డీవీడీ
ఎదైన తాకిడి నిశ్శబ్దం
రైలు కూత, పక్షి కూత, కారుకూత
అంతా శబ్దం
అనంత సృష్టిమూలం నిశ్శబ్దం
సహిస్తే, గ్రహిస్తే,
నిగ్రహిస్తే, అనుగ్రహిస్తే
ప్రతి పదం - మురళీ రవం!
ప్రతి రవం - కాల భైరవం!!
- ప్రఖ్యా మధు బాబు