ఏడాది తిరిగింది...
మళ్ళీ పిలుపొచ్చింది...
కవి కోకిలల్లారా రారండంటూ
భువి కోలవెఱ్ఱికి మందిమ్మంటూ.
ఏ అమాయకపు కాకిగూటిలోనో
గుడ్డులా ఉన్న ఓ భావనని ఎదిగించాలనుకున్నా
అన్నిగూళ్ళూ నెలకొన్న ఓ సాలెగూటికి చేరా.
అనగనగా ఓ చిన్నవాడు
అనీ అనకుండా ఓ చిన్నది
అన్నీ అనుకుంటూ మరెందరో
అనకొండ లాంటి ఓ వలకి చిక్కారు
అనుకోకుండా బ్రతుకు పుస్తకం అందరికీ తెరిచారు
జీవితంలో ప్రతి క్షణం..
రెండు ట్వీట్ల మధ్య స్టేటస్ అప్‌డేటుతో
రెండు ట్రెండింగుల మధ్య ఓ షేరుతో
ఒకరి అరుగాలం పంటలు మరొకరు
ఏ కాకుల బారినా పడకుండా రక్షిస్తూ
ఏకాకిగా తలొంచుకు మిగిలారు.
వసపిట్ట వెనుకపడి,
గుసగుసల గగ్గోలుతో,
అసాంఘికంగా సంఘమయ్యారు -
పక్కవాడితో పనిలేకుండా,
ఎదుటివాడికి ఎంతో దూరంగా.
ఒక్కొక్కరే పదిలంగా అల్లుకొన్న
అతుకుల బొంత తయారయింది.
ఒకరి వల్లో మరొకరు పడి ఉంటే
ఒకరి తల్లో మరొక్కరి తలంపు మాత్రమే ఉంటే
అలవోకగా ప్రణయాలు వర్ణించే
నా కలానికి వేగం హెచ్చేది
నవ కాలానికి నందనం వచ్చేది.
కానీ,
దగ్గరగా చూద్దును కదా,
ప్రతి క్షణామూ వింతగా..
లక్షలాది ఊసుల ఆసరాతో
ఊహల నెమళ్ళు పురివిప్పుతున్నాయి
వేలాది అనుభవాల వీక్షణతో
అశల చివుళ్ళకు ఆలంబనలు అందుతున్నాయి
వందలాది స్నేహాల తోడుగా
కొత్త నెగళ్ళు మొలకెత్తుతున్నాయి
పది హృదయాలతో కలిసి ఆలోచిస్తూ
ఎన్నో పగుళ్ళు అతుకుతున్నాయి
అనుబంధాలు కరువైన మందలకు దూరంగా
నైరూప్య ప్రపంచంలో
సారూప్యపు వలయాలు విస్తరిస్తున్నాయి
ఓడించకుండా గెలుస్తూ -
గెలిపిస్తూ గెలుస్తూ ఆడే ఆటలు
కొత్త నియమాలేవో కూర్చుకుంటున్నాయి.
జీవిత పుస్తకాలు తెరుచుకుంటూ
మెదళ్ళ ద్వారాలు తెరుస్తున్నాయి
మనసులు పుష్పక విమానాలవుతున్నాయి
నావల్లో తిరుగుతుంటే స్పష్టమవుతోంది,
జీవితం అంటే -
రెండు కేరింతల మధ్య నిశ్శబ్దం
రెండు నిస్త్రాణల చాటున ఉత్సాహం
రెండు సుషుప్తుల నడుమ మెలకువ
రెండు వెలుగులను చూపించే చీకటి అని -
ఒదుగుతూ ఎదిగితే
కోటగోడలైనా, మెడలువంచి
పాదాల చెంత చేరి మొక్కుతాయి అని -
మరుగుజ్జులై ఎగిరితే
వెంపలి చెట్టు సైతం వెక్కిరిస్తుంది అని -
సోష రాకుండా ఇన్ని పాఠాలు నేర్పుతూ
సోషల్ నెట్‌వర్కు నా నెట్ వర్తు పెంచింది
ఎందరో చరిత్రలకి తోడు నడుస్తూ
ఎన్నో చిత్రాలకి మౌన సాక్ష్యమిస్తూ
ఎవరో బాధలని అనుభవిస్తూ
ఎన్నడూ తెలియని కోణాలను దర్శిస్తూ
ఒకే జీవితంలో వందల జీవనాల భావన
అంతర్జాలంలో ఐంద్రజాలికుడి ఆవాహన
అంతరాత్మలో పరమశివ తత్వపు అవగాహన
-వంశీ ప్రఖ్యా