అంతరాత్మ
పచ్చని చెట్టు కింద కూర్చొని
చిగురుటాకులను చించావు
మునివేళ్ళతో కొనలనే తెంపావ్
లేత చిగురులను చిదిమివేసావ్
మల్లెతీగ దగ్గరకెళ్లి మొగ్గను
కొనగోటితోనే గిల్లి తుంచావు
విచ్చకుండానే మోడయ్యింది
పరిమళాలు లేకుండా నేల రాలింది
స్వేచ్ఛగా ఎగిరే తూనీగను పట్టావు
కర్కశ పీడనంతో రెక్క విరిచావు
అచలన జీవిని చూసి చిందులేసావు
విహంగ ఆహ్లాదాన్ని హరింప వేశావు
చిటారుకొమ్మన చిలకే మయ్యింది
చిలకను తెచ్చి పంజరంలో పెట్టావు
పలుకులు నేర్పి పలుచన చేసింది
కులుకులు వదిలి కుయుక్తులు చెప్పింది
ప్రకృతి చెప్పే పాఠాలు వద్దంటున్నావు
ఆకృతిలేని కృత్రిమాలే కావాలంటున్నావు
వికృతి దాల్చిన మనసును పెంచావు
జాగృతి మరచి మనుగడ సాగిస్తున్నావు
చేసిన తప్పులు ఎక్కడికెళతాయి
నిను వెంటాడుతూ వెన్నంటి ఉంటాయ్
నీలో అలజడి రేపుతూనే ఉంటాయి
ఆత్మ పరిశీలన అడుగుతూనే ఉంటాయి
నిబ్బరంగా నిలిపి ఉంచు నీలో సహనం
మనసంత పూర్తిగా నింపుకో సున్నితత్వం
ఒప్పులు చేసి నవ్వుతూ గొప్పగా బతుకు
అంతరాత్మ ఎప్పుడు నీకు గొప్పగా తోడు ఉంటుంది.
hhhhh